ఎయిర్‌పోర్టులా రైల్వేస్టేషన్!
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:20 AM
కార్పొరేట్ ఆఫీసులను తలపించేలా అద్దాలతో అదిరిపోయే భవనాలు.. అత్యాఽధునిక మల్టీలెవల్ పార్కింగ్.. లోపలికి వెళ్లగానే ఎస్కలేటర్లు, ఎలివేటర్లతో నేరు ఒకటో అంతస్తులోకి ప్రవేశం..
అత్యాధునికంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి
కార్పొరేట్ ఆఫీసులను తలపించేలా నిర్మాణాలు
పైన వెయిటింగ్ హాళ్లు, దుకాణాలు.. కింద ప్లాట్‌ఫాంలు
ఎస్కలేటర్లు, ఎలివేటర్లతో నేరుగా మొదటి అంతస్తులోకి..
రైలు వచ్చే ముందు దిగి ప్లాట్‌ఫాంకు వెళ్లేలా ఏర్పాట్లు
10వ ప్లాట్‌ఫాం వైపు 90 శాతం పనులు పూర్తి
మార్చి ఆఖరుకల్లా ప్రయాణికులకు అందుబాటులోకి..
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ ఆఫీసులను తలపించేలా అద్దాలతో అదిరిపోయే భవనాలు.. అత్యాఽధునిక మల్టీలెవల్ పార్కింగ్.. లోపలికి వెళ్లగానే ఎస్కలేటర్లు, ఎలివేటర్లతో నేరు ఒకటో అంతస్తులోకి ప్రవేశం.. పైన వెయింటింగ్ హాళ్లు, దుకాణాలు.. వాటి కింద రైల్వే ప్లాట్‌ఫారాలు.. రైలు వచ్చే ముందు కిందకు దిగి నేరుగా కావాల్సిన ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లే అవకాశం.. మెట్రోస్టేషన్లు, బస్‌స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్‌లోకి రావడానికి.. రైల్వేస్టేషన్ నుంచి నేరుగా వాటికి చేరుకునేందుకు స్కైవాక్‌లు.. విమానాశ్రయం తరహాలో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విశేషాలు ఇవి. తొలిదశలో భాగంగా ప్లాట్‌ఫామ్-10 వైపు చేపట్టిన అభివృద్ధి పనులు 90ు పూర్తికావడంతో.. మార్చి నెలాఖరు కల్లా అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. నాలుగు అంతస్తులతో 22,516 చ.మీ వైశాల్యంతో చేపట్టిన ఐకానిక్ స్టేషన్‌భవనం పనులు దాదాపు పూర్తయ్యాయి. దక్షిణంవైపు 14,972 చదరపు మీటర్ల విస్తీర్ణంతో మరో భవనాన్ని నిర్మించారు. రూ.719కోట్లతో నిర్మిస్తున్న స్టేషన్ తొలిదశ భవనాలు ఇవి. రెండో దశలో మొదటి ప్లాట్‌ఫామ్‌వైపు భవనాలు కూడా పూర్తయితే స్టేషన్ స్వరూపం పూర్తిగా మారిపోనుంది. రెండోదశ పను లు ఈ ఏడాది చివరినాటికి పూర్తికావచ్చని సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
ప్లాట్‌ఫామ్‌లకుపైనే వెయిటింగ్, దుకాణాలు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు నేరుగా మొదటి అంతస్తుకు వెళతారు. తర్వాత రైలు పట్టాలకు 21 మీటర్లపైన రెండు అంతస్తులతో ఏర్పాటు చేసిన కాన్కోర్స్‌కు చేరుకుంటారు. ఇందులో ఒక అంతస్తులో ప్రయాణికులు వేచిఉండవచ్చు, దానిపై అంతస్తులో రిటైల్ దుకాణాలు, కెఫెటేరియాలు ఉంటాయి. స్టేషన్‌లో 108 మీటర్ల నిడివితో ఒకటి, 120మీటర్ల నిడివితో మరో కాన్కోర్‌ను నిర్మించారు. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన రైలు స్టేషన్‌కు వచ్చే సమయంలో కావాల్సిన ప్లాట్‌ఫామ్ వద్దకు నేరుగా దిగి వెళ్లవచ్చు. ఇక ఉత్తరం వైపు 400కు పైగా వాహనాలను పార్క్ చేసేలా మల్టీలెవల్ పార్కింగ్, దక్షిణ భాగం లో 200 వాహనాలను ఉంచేందుకు బేస్‌మెంట్‌లో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. స్టేషన్ ప్రాంగణంలో మొత్తం 26 ఎలివేటర్లు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు, 4 ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌లను నిర్మించారు. వివిధ ప్రాంతాల నుంచి రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు సులువుగా సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్‌ను చేరుకునేలా 9 మీటర్ల వెడల్పుతో స్కైవాక్‌ను నిర్మించారు. స్టేషన్‌లోకి వచ్చిపోవడానికి వేర్వేరు ద్వారాలను ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు విద్యుత్ అవసరాల కోసం 5వేల కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను, 100కు పైగా ఈవీ చార్జింగ్ పాయింట్లను అమర్చారు.
