శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైల్ కారిడార్ల టెర్మినల్..!
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:40 AM
గంటకు 300-350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ రైల్ కారిడార్‌తో మెట్రో రైళ్లను అనుసంధానం చేసేందుకు అడుగులు పడుతున్నాయా..
మెట్రో దిగి హైస్పీడ్ రైలు ఎక్కొచ్చు!
దాంతో మెట్రో అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి మౌఖిక ఆదేశం
4 రవాణా వ్యవస్థలతో జంక్షన్ అభివృద్ధికి అడుగులు
హైదరాబాద్ సిటీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): గంటకు 300-350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ రైల్ కారిడార్‌తో మెట్రో రైళ్లను అనుసంధానం చేసేందుకు అడుగులు పడుతున్నాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించి గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో మెరుగైన ప్రయాణ సాధనంగా ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. మెట్రో వ్యవస్థను మరింత పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో పార్ట్-ఏ కింద 3 కారిడార్లు, పార్ట్-బీ కింద 5 కారిడార్లను ప్రతిపాదించింది. మొత్తం రూ.43,848 కోట్లతో ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు ఎదురుచూస్తోంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె మార్గాల్లో హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఆయా ప్రాజెక్టుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు సర్వే ప్రారంభించినట్లు తెలిసింది. ఇదే సమయంలో భూ సామర్థ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ 3 మార్గాల టెర్మినల్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి సుమారు 500 ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు మధ్య ఉన్న బహదూర్‌గూడ, రషీద్ గూడ, చిన్న గోల్కొండ ప్రాంతాల్లో 500 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో దాన్ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హైస్పీడ్ రైల్ కారిడార్లు ఇక్కడ ఒకేచోట కలుస్తుండడంతో మెట్రో వ్యవస్థను అనుసంధానం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
నాలుగు ప్రజా రవాణా వ్యవస్థలతో జంక్షన్ అభివృద్ధి!
హైదరాబాద్ సిటీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మిస్తున్న మెట్రో రైల్‌ను హైస్పీడ్ రైల్ కారిడార్‌తో అనుసంధానం చేసే విషయంపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండో దశలో నాగోల్ నుంచి ఎల్‌బీ నగర్, చాంద్రాయణగుట్ట మీదుగా విమానాశ్రయం వరకు 36.8 కి.మీ. మెట్రో నిర్మించనున్నారు. అలాగే విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు (40 కి.మీ.) కూడా చేపడుతున్నారు. ఈ రెండు మెట్రో మార్గాలను కూడా హైస్పీడ్ రైల్ కారిడార్‌తో అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు నుంచి సుమారు 4-5 కి.మీ. దూరంలోనే హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రోడ్డు, రైలు, మెట్రో రైలు, విమానాశ్రయంతో కలిపి మొత్తం నాలుగు మార్గాలను కొత్తగా నిర్మించబోయే హైస్పీడ్ రైల్ కారిడార్ జంక్షన్‌తో కలిపేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై సంబంధిత శాఖ అధికారులు త్వరలో అధ్యయనం చేయనున్నారు.