హైదరాబాద్ నుంచి ముడి సరుకు ఆగ్రాలో మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారీ!
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:36 AM
ఆగ్రాలో మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ నుంచి వందల కిలోల ముడి సరుకును అక్కడికి తరలించి, డ్రగ్స్ తయారు చేస్తున్న.....
ఈగల్ పోలీసుల నిఘాతో ముఠా గుట్టు రట్టు
ఆగ్రాలో ప్రధాన నిందితుడి అరెస్టు
హైదరాబాద్ సిటీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఆగ్రాలో మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ నుంచి వందల కిలోల ముడి సరుకును అక్కడికి తరలించి, డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (ఈగల్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు మనోజ్‌కుమార్‌ను ఆగ్రాలో అరెస్టు చేసినట్లు తెలిసింది. రాజస్థాన్‌కు చెందిన వీరేంద్ర స్వామి అలియాస్ గిరీశ్ థాపర్ డ్రగ్స్ తయారు చేసి రూ.కోట్లు సంపాదించాలని ఆశపడ్డాడు. అందుకోసం తన స్నేహితులైన రాజు, సుమిత్, శిశుపాల్, మనోజ్ మాధుర్‌లను భాగస్వాములుగా చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ముడిసరుకు దొరుకుతుందని గుర్తించాడు. డ్రగ్స్ తయారీ కోసం తన తో పాటు లెక్చరర్‌గా పనిచేసిన యూపీకి చెందిన మనోజ్‌కుమార్‌ను సంప్రదించాడు. డబ్బులు ఆశ చూపించి, మెఫిడ్రిన్ తయారీకి ఒప్పించాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసుకుంటున్న స్నేహితుడు గిరీశ్‌ను కలిసి పథకం గురించి చెప్పాడు. అతని సహకారంతో షాద్‌నగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. కూకట్‌పల్లిలో ఉన్న ఓ కంపెనీ నుంచి కొన్ని ముడి పదార్థాలు, రసాయనాలు కొనుగోలు చేశారు. వాటి ద్వారా కొద్ది మొత్తంలో మెఫిడ్రిన్ తయారు చేసి దాన్ని రాజస్థాన్‌లో విక్రయించారు.
ఆగ్రాకు మకాం మార్చిన నిందితులు..
మాదకద్రవ్యాల తయారీ, డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్న ఈగల్ పోలీసులకు కొద్దిరోజుల క్రితం నగరంలోని ఓ కంపెనీ నుంచి డ్రగ్స్ తయారీలో వినియోగించే ముడిసరుకు, రసాయనాలు వందల కిలో లు ఇతరప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు తెలిసింది. ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ రమేశ్‌రెడ్డి తన బృందంతో నిఘా పెట్టి ఆర్డర్లను పరిశీలించగా.. మనీశ్, గిరీశ్, గిరీశ్ థాపర్ పేర్లతో వేర్వేరుగా గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలకు వందల కిలోల ముడిసరుకు రవాణా అయినట్లు గుర్తించారు. తీగ లాగిన పోలీసులకు వీరేంద్రస్వామి ముఠా గురించి తెలిసింది. నిందితులు హైదరాబాద్ నుంచి ఆగ్రాకు మకాం మార్చినట్లు తేలింది. రాజస్థాన్ పోలీసుల సహకారంతో ఈగల్ పోలీసులు వీరేంద్రస్వామి, గిరీశ్‌లను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో ఆగ్రాలో మరో నిందితుణ్ని అరెస్టు చేశారు. ఆగ్రా శివారులోని ఖందౌలీలో నిల్వ ఉంచిన సుమారు 1000 కిలోల ముడి సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మనోజ్‌కుమార్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.