Share News

అక్రమ దత్తతలను అనుమతిస్తే..పిల్లల అక్రమ రవాణా పెరుగుతుంది

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:21 AM

అక్రమంగా దత్తత తీసుకున్న పిల్లలతో.. వారిని పెంచుకుంటున్న తల్లిదండ్రులకు ఎంత అనుబంధం ఉన్నప్పటికీ ఆ దత్తతను అనుమతించలేమని హైకోర్టు స్పష్టంచేసింది.

అక్రమ దత్తతలను అనుమతిస్తే..పిల్లల అక్రమ రవాణా పెరుగుతుంది

  • బంధం బలపడినా చట్టవిరుద్ధమైన దత్తతను అంగీకరించలేం

  • ‘కారా’ మార్గదర్శకాలు పాటించాల్సిందే: హైకోర్టు

  • నల్గొండ జిల్లాకు చెందిన దంపతులు వేసిన పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా దత్తత తీసుకున్న పిల్లలతో.. వారిని పెంచుకుంటున్న తల్లిదండ్రులకు ఎంత అనుబంధం ఉన్నప్పటికీ ఆ దత్తతను అనుమతించలేమని హైకోర్టు స్పష్టంచేసింది. దత్తత విషయంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సెంట్రల్‌ అడాప్షన్‌ రీసోర్స్‌ అథారిటీ (కారా) మార్గదర్శకాలను పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. తల్లిదండ్రులు, పిల్లలు బాధపడుతున్నారనే కారణంతో ఆ దత్తతలను చట్టబద్ధం చేయడానికి అనుమతిస్తే.. చాలా మంది అక్రమార్కులకు అది ఊతమిస్తుందని, చిన్న పిల్లల అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు.. మధ్యవర్తి ద్వారా దత్తత తీసుకుని పెంచుకుంటున్న తమ బిడ్డను తమకు అప్పగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఒక జంట దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. నల్గొండ జిల్లా చిన్న సూరారం గ్రామానికి చెందిన ముత్తినేని వెంకన్న దంపతులకు 2014లో వివాహమైంది. చాలా ఏళ్లుగా పిల్లలు లేకపోవడంతో అనాథ బాలికను దత్తత తీసుకోవడానికి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. వారి అభ్యర్థన కలెక్టర్‌ వద్ద ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా.. నక్క యాదగిరి వద్ద వెంకన్న దంపతులు 2023లో నెల వయసున్న బాలికను దత్తత తీసుకున్నారు. ఆ శిశువును అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే, ఆ పాపను అక్రమంగా దత్తత తీసుకున్నారంటూ కొంతమంది వెంకన్నపై, మధ్యవర్తిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారులు ఆ పాపను తీసుకెళ్లిపోయారు. తమ పాపను అధికారులు అక్రమంగా తీసుకుకెళ్లారని.. చిన్నారిని తమకు అప్పగించాలని కోరుతూహైకోర్టులో వెంకన్న పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ‘ప్రస్తుత కేసులో దత్తత అనేది సహజ తల్లిదండ్రుల నుంచి జరగలేదు. మధ్యవర్తి కస్టడీలో ఉన్న చిన్నారిని తెచ్చుకున్నారు. ఒకరకంగా ఇది పిల్లల అక్రమ రావాణా కిందికే వస్తుంది అని చెప్పాల్సి ఉంటుంది. ఈ దత్తత ‘కారా’ మార్గదర్శకాల ప్రకారం జరగలేదు. పెంచుకున్న చిన్నారికి పిటిషనర్లకు మధ్య మమకారం, అనుబంధం ఉందని చెప్పి.. చిన్నారిని వారికే ఇవ్వాలని మేం చెప్పలేం’ అంటూ పిటిషన్‌ను కొట్టేసింది.

Updated Date - Jan 31 , 2026 | 04:21 AM