కేకే కుమారుణ్ని బెదిరించిన ‘గడీల’పై దర్యాప్తు జరగాలి: హైకోర్టు
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:53 AM
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుమారుడు కే వెంకటేశ్వరరావును బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్‌రెడ్డికి ....
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుమారుడు కే వెంకటేశ్వరరావును బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తూ మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. రూ.3 కోట్లు ఇస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటానని డబ్బులు డిమాండ్ చేసిన కేసులో దర్యాప్తు జరగాల్సిందేనని, దాంతో అసలు వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొంది. కే కేశవరావు కుమారుడు కే వెంకటేశ్వర్‌రావు, కుమార్తె జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలకు అతి తక్కువ ధరకు బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్‌లో ప్లాట్లు రెగ్యులరైజ్ చేశారని, అందుకు సంబంధించిన జీవో 56ను కొట్టేయాలని రఘువీర్‌రెడ్డి పిల్ వేశారు. ఈ వ్యాజ్యం ఉపసంహరించుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని రఘువీర్‌రెడ్డి తనను బెదిరిస్తున్నారని వెంకటేశ్వర్‌రావు బంజారాహిల్స్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని రఘువీర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించింది.