పాత చికిత్సల వివరాలను దాచారని.. బీమా క్లెయిమ్ తిరస్కరించడం కుదరదు
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:51 AM
గతంలో చికిత్స పొందిన వివరాలను దాచిపెట్టారన్న సాకుతో ఆరోగ్య బీమా క్లెయిమ్‌ను తిరస్కరించడం సరి కాదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది....
హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): గతంలో చికిత్స పొందిన వివరాలను దాచిపెట్టారన్న సాకుతో ఆరోగ్య బీమా క్లెయిమ్‌ను తిరస్కరించడం సరి కాదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. మణిపాల్ సిగ్నా బీమా కంపెనీలో పాలసీ తీసుకున్న మద్ది సత్యనారాయణ, బూర్లె సరస్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఫోరం సభ్యుడు జనార్దన్‌రెడ్డి.. బాధితులకు బీమా సొమ్ముతో పాటు రూ.30వేలు నష్టపరిహారం, రూ.10వేలు ఖర్చుల కింద చెల్లించాలని ఆ సంస్థను ఆదేశించారు. కేసులో రెండో ఫిర్యాదుదారైన సరస్వతి 2024లో ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకోగా.. రూ.3లక్షల వరకు ఖర్చయింది. ఈ మేరకు ఆమె క్లెయిమ్ దాఖలు చేయగా.. మణిపాల్ సిగ్నా బీమా సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. 18ఏళ్ల వయస్సులో ఒక సారి, ఆరేళ్ల క్రితం మరోసారి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందారని..ఆ వివరాలను దాచిపెట్టినందున బీమా చెల్లించబోమని వాదించింది. దీనిపై విచారణ చేపట్టిన ఫోరం.. క్లెయిమ్‌ను తిరస్కరించడం కుదరదని స్పష్టం చేసింది. బాధితులకు నష్ట పరిహారంతోపాటు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.