డిసెంబరులో తగ్గిన విమాన జోరు!
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:19 AM
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొవిడ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో తగ్గిపోవడం ఇదే తొలిసారి. దేశీయ సర్వీసుల్లో అగ్రగామిగా ఉన్న ఇండిగో సంస్థ...
ఇండిగో సంక్షోభంతో భారీగా తగ్గిన ప్రయాణికులు
అంతర్జాతీయ ప్రయాణికుల్లో భారీ పెరుగుదల!
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొవిడ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో తగ్గిపోవడం ఇదే తొలిసారి. దేశీయ సర్వీసుల్లో అగ్రగామిగా ఉన్న ఇండిగో సంస్థ అంతర్గత సంక్షోభం కారణంగా గత డిసెంబరులో భారీ సంఖ్యలో విమాన సర్వీసులను రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం శంషాబాద్ విమానాశ్రయంపై ఎక్కువగా పడింది. 2024 డిసెంబరుతో పోలిస్తే 2025 డిసెంబరులో ప్రయాణికుల సంఖ్య 2,92,868 తగ్గిపోయింది. అలాగే నవంబరులో కూడా 2,66,670 మంది ప్రయాణికులు తగ్గారు. ఇదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెరగడం గమనార్హం. తాజాగా డీజీసీఏ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇండిగోతో పాటు ఇతర విమాన సంస్థల సర్వీసులు రద్దు కారణంగా ఒక్కనెలలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే 1394 విమాన సర్వీసులు తగ్గాయి. రద్దయిన సర్వీసుల్లో ఇండిగో సంస్థవే ఎక్కువగా ఉన్నాయి. పౌర విమానయాన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత డిసెంబరులో దేశవ్యాప్తంగా 8 విమానయాన సంస్థలు నడిపే 6,890 సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో ఇండిగో సర్వీసులే 5,689 ఉన్నాయి. ఇండిగో విమానాల రద్దు కారణంగా దాదాపు 9,02,384 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. వీరిలో దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్‌లోనే తగ్గడం గమనార్హం. మరోవైపు 2024 డిసెంబరుతో పోలిస్తే 2025 డిసెంబరులో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 13.5 శాతం పెరిగింది. ఇదే సమయంలో దేశీయ ప్రయాణికుల సంఖ్య 12.8 శాతం తగ్గింది. 2025 నవంబరుతో పోలిస్తే డిసెంబరులో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 21.1ు పెరగ్గా, దేశీయ ప్రయాణికులు 11.83ు తగ్గారు.
సరుకు రవాణాలో దూకుడు
సరుకు రవాణాలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు దూకుడుగా ఉంది. మిగతా మెట్రో నగరాలతో పోలి స్తే వృద్ధిరేటు అఽధికంగా ఉంది. 2024 డిసెంబరుతో పోలిస్తే 2025డిసెంబరులో 20.4ు వృద్ధిరేటు సాధించింది. అలాగే బెంగుళూరు 15.4ు, చెన్నై 15.1ు, ఢిల్లీ 12.8ు, ముంబై 9.9ు వృద్ధి సాధించాయి.