హైదరాబాద్ @ 4
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:55 AM
తెలంగాణ తన సొంత పన్ను వనరుల నుంచే అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నట్లు కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. వార్షిక ప్రగతి రేటు 12.6 శాతం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ చేరిందని తెలిపింది.
వేగంగా పెరుగుతున్న నగరాల్లో నాలుగో స్థానం
తెలంగాణకు సొంత పన్నుల నుంచే అధిక ఆదాయం
కేంద్ర ఆర్థిక సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తన సొంత పన్ను వనరుల నుంచే అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నట్లు కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. వార్షిక ప్రగతి రేటు 12.6 శాతం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ చేరిందని తెలిపింది. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతోందని.. 2022-23లో 8.61 శాతం ఉండగా 2023-24లో6.36ు, 2024-25లో 3.67 శాతానికి తగ్గిందని వివరించింది. 2025-26లో తెలంగాణలో ద్రవ్యోల్బణ రేటు ఏప్రిల్ నుంచి డిసెంబరు నాటికి 0.20 మాత్రమే ఉందని వెల్లడించింది. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల కారణంగా తెలంగాణలో వ్యవసాయ దిగుబడి తగ్గుతోందని తెలిపింది. హెక్టారుకు జాతీయ సగటు కంటే తక్కువగా దిగుబడి ఉంటోందని పేర్కొంది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరుగుతున్నట్లు తెలిపింది. 2014లో తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు ఉండగా 2023 నాటికి 2.21 కోట్ల ఎకరాలకు పెరిగిందని వెల్లడించింది. ప్రభుత్వ, పైవ్రేటు రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని సర్వే తెలిపింది. ఉత్పాదక రంగంలో దాదాపు 60 శాతం ఉపాధి కల్పిస్తున్న ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం సంపాదించిందని పేర్కొంది. భూ భారతి పోర్టల్ ద్వారా రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగాలను తెలంగాణ ఏకీకృతం చేసిందని వెల్లడించింది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో మహిళలపై ఆంక్షలు తొలగించారని సర్వే పేర్కొంది. మహిళల రక్షణ కోసం హైదరాబాద్‌లో ప్రవేశపెట్టిన షీ టీమ్స్‌ను కీలకమైన విధాన నిర్ణయంగా అభివర్ణించింది. మంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతోపాటు హైదరాబాద్ కూడా అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందినట్లు తెలిపింది. భారతదేశం ఆర్థికంగా ముందంజ వేస్తున్నప్పటికీ న్యూయార్క్, లండన్, షాంఘై, సింగపూర్‌ల మాదిరిగా మన నగరాలు గ్లోబల్ సిటీలుగా మారేందుకు సంఘర్షిస్తున్నాయని వెల్లడించింది. 2019-35 మధ్య అతివేగంగా పెరుగుతున్న నగరాల్లో సూరత్, ఆగ్రా, బెంగళూరు తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. 2018 ధరలకు హైదరాబాద్ జీడీపీ 50.6 బిలియన్లు కాగా 2035 నాటికి అది 201.4 బిలియన్లకు చేరుకుంటుందన్న ప్రపంచ బ్యాంక్ అంచనాలను ఆర్థిక సర్వే ఉటంకించింది. 2019-35 మధ్య హైదరాబాద్ ఆర్థిక ప్రగతి 8.47 శాతం ఉంటుందని అంచనా వేసింది.