Share News

ఉత్సాహంగా హోలీ వేడుకలు

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:13 AM

రంగుల పండుగ హోలీని రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ.....

ఉత్సాహంగా హోలీ వేడుకలు

  • ఓయూలో ఏబీవీపీ సంబరాలు.. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. యాదాద్రి జిల్లాలో వినూత్నంగా హోలీ

  • నీటమునిగి 7గురు మృతి, ముగ్గురి గల్లంతు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రంగుల పండుగ హోలీని రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణం రంగుల హరివిల్లులా మారింది. ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి రంగులు చల్లుకున్నారు. గత 20ఏళ్లుగా ఓయూలో ఏబీవీపీ ఈ వేడుకలు నిర్వహి స్తుండడం అభినందనీయమన్నారు. దేశభక్తి నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో క్యాంపస్‌ హోరెత్తింది. ఇక, వివిధ దేశాల్లో భారతీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హోలీ రోజున భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ జనసేన కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌, బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన మహ్మద్‌ యూనస్‌ చిత్రపటాలపై పేడ, టమాటాలు విసిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఖమ్మం జిల్లా లోక్యాతండా, జగమాల్‌తండాలో 3 రోజుల పాటు జరిగే హోలీ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా గిరిజనులందరూ కలిసి వలయాకారంలో తిరుగుతూ కర్రలతో లయబద్ధంగా ఆడుతూ కోలాట వేడుక నిర్వహించారు. అయితే, పండగ పూట పలు జిల్లాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. హోలీ ఆడిన అనంతరం స్నానాల కోసం నదుల్లోకి, చెరువుల్లోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు గల్లంతయ్యారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన సాయికుమార్‌(20), రోనూ చౌదరి(19)లు స్నానాల కోసం చెరువుల్లో దిగి లోతు అంచనా వేయలేక నీట మునిగారు. ఆర్మూర్‌ పట్టణంలో హర్షిత్‌(15) అనే బాలుడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పద్మగూడెం గ్రామానికి చె ందిన ఇద్దరు స్నేహితులు గుండె నాగేశ్వరరావు (46), పద్దం ప్రసాద్‌(36) గోదావరిలో గల్లంతయ్యారు. వారి కుటుంబాలతో కలిసి స్నానానికి వెళ్లిన వీరూ.. తమతో వచ్చిన వారిని కాపాడే ప్రయత్నంలో నీటిలో కొట్టుకుపోయారు. మరోవైపు, మెదక్‌ జిల్లా రుద్రారంలో.. స్నేహితులతో కలిసి హోలీ ఆడడానికి వెళ్లిన కర్రె మహేందర్‌ (20) చెరువులో మునిగి మృతి చెందాడు. దుండిగల్‌ మండలం సూరారం పరిధిలోని పంతులు చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు సాగర్‌(17), అభిషేక్‌(17) ఊపిరాడక మరణించారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం చిల్కమర్రిలో డిగ్రీ విద్యార్థి రాజు(20) చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. నల్లగొండ జిల్లా దేవరకొండలో హోలీ ఆడేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి కార్తికేయ(16)మృతి చెందాడు. గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లికి చెందిన రాజు అనే విద్యార్థి ఈత కొట్టేందుకు గల్లంతయ్యాడు.

Updated Date - Mar 04 , 2026 | 03:13 AM