Share News

పరిహారంలో వ్యత్యాసాలు ఎందుకు?

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:42 AM

సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారంలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని ఆ కంపెనీని హైకోర్టు ప్రశ్నించింది..

పరిహారంలో వ్యత్యాసాలు ఎందుకు?

  • సిగాచీ, రాష్ట్ర ప్రభుత్వాలకుహైకోర్టు ప్రశ్న

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారంలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని ఆ కంపెనీని హైకోర్టు ప్రశ్నించింది. పరిహారం చెల్లింపు విషయంలో వైఖరి ఏంటో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. కేసులో ఈపీఎ్‌ఫవో రీజినల్‌ కమిషనర్‌ను, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, సంగారెడ్డి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలను ప్రతివాదులుగా చేర్చింది. సిగాచీ పరిశ్రమ పేలు డు బాధితులకు పరిహారం ఇవ్వడంతోపాటు దర్యాప్తు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్రాంత శాస్త్రవేత్త కలపల బాపూరావు దాఖలు చేసిన పిల్‌పై గురువారం ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అమికస్‌ క్యూరీ (కోర్టు సహాయకుడు) డొమినిక్‌ ఫర్నాండేజ్‌ వాదిస్తూ.. పరిహారం చెల్లింపుల్లో తేడాలు ఉన్నాయని తెలిపారు. సిగాచీ పరిశ్రమ రూ. కోటి చెల్లిస్తామని స్టాక్‌ మార్కెట్లకు సమాచారం ఇచ్చిందని కానీ అంత చెల్లించలేదని పేర్కొన్నారు. ఈపీఎ్‌ఫవో నుంచి రావాల్సిన పరిహారంలో సైతం వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు. సిగాచీ కంపెనీ న్యాయవాది వాదిస్తూ రూ. 45.61 కోట్లు ఇప్పటికే చెల్లించామని, ఇంకా రూ.6.05 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజినీకాంత్‌ రెడ్డి వాదిస్తూ.. ఏడుగురిపై కేసు నమోదు చేశామని, వారిలో ఐదుగురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా పడింది.

Updated Date - Jan 30 , 2026 | 03:42 AM