సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:41 AM
ప్రభుత్వం నుంచి ఫీజు రీయెంబర్స్‌మెంట్ బకాయిలు రాలేదనే కారణంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వని ప్రైవేటు కాలేజీలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
బోధన రుసుముల చెల్లింపుపై సమాధానం ఇవ్వండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి ఫీజు రీయెంబర్స్‌మెంట్ బకాయిలు రాలేదనే కారణంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వని ప్రైవేటు కాలేజీలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కాలేజీల వేధింపులకు గురవుతున్న విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. ఫీజులు చెల్లించలేదన్న కారణంతో సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న ప్రైవేటు కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత సంఘం, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ విద్యార్థుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి. దీనిపై గురువారం చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ‘ప్రభుత్వ కోణంలో ఆలోచిస్తే ఇది కేవలం పెండింగ్ బిల్లులకు సంబంధించినదిగా కనిపిస్తుంది.. విద్యార్థులకు మాత్రం వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం’ అని వ్యాఖ్యానించింది. ఫీజులకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆర్థికశాఖకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.