గుడులు, ఆస్పత్రులు, బడుల వద్ద ‘నాన్‌వెజ్’ వద్దు
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:55 AM
ఆలయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల నుంచి 100 మీటర్లలోపు మాంసం, నాన్‌వెజ్ ఆహార పదార్థాలు విక్రయించకుండా ఓ విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది...
విధానం రూపొందించాలని హైకోర్టు సూచన
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఆలయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల నుంచి 100 మీటర్లలోపు మాంసం, నాన్‌వెజ్ ఆహార పదార్థాలు విక్రయించకుండా ఓ విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. భక్తుల మనోభావాలు, ప్రశాంతత, పరిశుభ్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు తయారు చేయాలని మున్సిపల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు స్పష్టం చేసింది. మాంసం విక్రయ కేంద్రాల ప్రారంభానికి సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) పొందాలనే నిబంధనను చేర్చాలని సూచించింది. నాలుగు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లో తన వ్యాపారాన్ని జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌జోన్ డిప్యూటీ కమిషనర్, నాంపల్లి పీఎస్ ఎస్‌హెచ్‌వో అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్రకు చెందిన బిపిన్ రాందాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ అంశంపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు.