కత్తి చంద్రబాబుది.. పొడిచేది రేవంత్‌రెడ్డి!
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:12 AM
ఢిల్లీ సాక్షిగా తెలంగాణకు జలద్రోహం చేయడానికి సిద్ధమవుతున్నారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు.
ఢిల్లీ సాక్షిగా రాష్ట్రానికి జల ద్రోహం
200 టీఎంసీల గోదావరి నీటిని ఏపీకి తరలించే కుట్ర
రేవంత్ సర్కారు రాష్ట్రానికి మరణ శాసనం రాయబోతోంది
రాష్ట్రానికి అన్యాయం చేస్తే కేసీఆర్ ఆధ్వర్యంలో జలపోరాటం: హరీశ్
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ సాక్షిగా తెలంగాణకు జలద్రోహం చేయడానికి సిద్ధమవుతున్నారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. 200 టీఎంసీల గోదావరి జలాలను ఏపీకి తరలించే కుట్ర జరుగుతోందని, ఢిల్లీలో నిర్వహించిన జలవివాదాల కమిటీ సమావేశం పోలవరం-నల్లమలసాగర్‌కు పరిష్కారం కోసమేనని ఆరోపించారు. జలద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుదైతే, పొడిచేది రేవంత్‌రెడ్డి అని చెప్పారు. గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్‌ఎస్ మొదటి నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ వస్తోందన్నారు. బనకచర్ల అయినా, నల్లమలసాగరైనా మారింది పేరు మాత్రమేనని, ఏపీ జలదోపిడీ ఆగలేదని అన్నారు. ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల సాగునీటి సమావేశం సాక్షిగా రేవంత్ ప్రభుత్వం మరణశాసనం రాయబోతోందని, నల్లమలసాగర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తోందని ఆరోపించారు. తాను ప్రశ్నించిన తర్వాతే ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామంటూ రెండు షరతులు పెట్టి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని చెప్పారు. నల్లమలసాగర్‌కు డీపీఆర్ ఆపాలని, ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వొద్దన్న షరతులు విధించారని తెలిపారు. వీటికి కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఢిల్లీ సమావేశానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. నల్లమలసాగర్‌కు అగీకారం తెలిపి, తెలంగాణకు మరణశాసనం రాయాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు ఒత్తిడితో ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశాన్ని రాష్ట్రం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని సమావేశానికి పంపడమంటే తెలంగాణకు ద్రోహం చేయడానికే కదా? అని నిలదీశారు. ఇదే ఆదిత్యనాథ్ గతంలో కాళేశ్వరం, గోదావరి, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, చనాక కొరాటా, రామప్ప డైవర్షన్‌లు అక్రమ ప్రాజెక్టులని.. వాటిని నిలిపివేయాలని చెప్పారని గుర్తుచేశారు.
మొదటి నుంచి రేవంత్ మద్దతు!
గోదావరి జలాలను ఏపీ అక్రమంగా తరలించుకువెళ్లేలా పోలవరం, నల్లమలసాగర్‌కు రేవంత్‌రెడ్డి పథకం ప్రకారమే సహకరిస్తున్నారని హరీశ్ ఆరోపించారు. వెళ్లనని చెబుతూనే రేవంత్‌రెడ్డి ఢిల్లీ సమావేశానికి వెళ్లారని, సంతకం చేసి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాశారని, వేయనంటూనే కమిటీ వేసి ఏపీ జల దోపిడీకి ఎర్ర తివాచీ పరిచారని విమర్శించారు. టెండర్ గడువు ముగిశాక సుప్రీంకోర్టుకు వెళ్లి నల్లమలసాగర్‌కు పరోక్షంగా అంగీకారం తెలిపారన్నారు. చివరకు పిటిషన్ వాపస్ తీసుకున్నారని చెప్పారు. ఢిల్లీకి, దావో్‌సకు తిరగడం తప్ప పాలనపై దృష్టిపెట్టని రేవంత్ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరని, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ అయినా పట్టించుకొని రాష్ట్రానికి నష్టం కలగకుండా చూడాలని కోరారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్ రాష్ట్రానికి జరుగతున్న జల ద్రోహాన్ని గుర్తించి, తక్షణం అడ్డుకోవాలని చెప్పారు. నీటి హక్కుల సాధన కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో మరో పోరాటం చేస్తామని హరీశ్ హెచ్చరించారు.
మునిసిపాలిటీలపై ఎగిరేది గులాబీ జెండానే: హరీశ్‌రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ సొంత నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని హరీశ్ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని అన్ని మునిసిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ నేత సుప్రభాత్‌రావు, తదితరులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం వారికి హరీశ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. .