రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారు
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:49 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్ధ పూర్తిగా గాడి తప్పిందని, కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం...
అఫిడవిట్‌తో సాదాబైనామాలకు ఉరితాడు: హరీశ్
హైదరాబాద్/సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్ధ పూర్తిగా గాడి తప్పిందని, కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. రెవిన్యూ శాఖలో విపరీతమైన అవినీతి జరుగుతుందని, రోజూ ఏదో ఒకచోట తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడుతున్నారని, కింది స్ధాయి అధికారుల నుంచి మంత్రి కార్యాలయం వరకు అంతా అవినీతేనని విమర్శించారు. సిద్దిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన.. ఆ సమయంలో సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. స్వయాన మంత్రి కుమారుడే భూకబ్జాలకు పాల్పడితే అతనిపై కేసులు పెట్టాల్సిన ప్రభుత్వం ఆ భూమిని కాపాడేందుకు కృషి చేసిన సీఐని బదిలీ చేసిందని మండిపడ్డారు. భూమి అమ్మిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన విధించి సాదాబైనామాకు ఉరితాడు బిగించారని ధ్వజమెత్తారు. భూ భారతి పేరిట కాంగ్రెస్ మార్క్ అవినీతి జరుగుతోందని ధ్వజమెత్తారు. వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న వారికి రెండున్నరేళ్లుగా డబ్బులు చెల్లించడం లేదని, దీనిపై అసెంబ్లీలో నిలదీస్తే వెంటనే ఇస్తామని ప్రకటించిన మంత్రి.. ఇంత వరకు రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.