Share News

నాపై కాంగ్రెస్‌ నేతల తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:39 AM

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వాళ్లు బురదలో ఉండి.. ఆ బురదను తమకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

నాపై  కాంగ్రెస్‌ నేతల తప్పుడు ప్రచారం
harishrao

దానంపై సుప్రీం తీర్పు.. రేవంత్‌కు చెంపపెట్టు : హరీశ్‌రావు

పరువు నష్టం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వాళ్లు బురదలో ఉండి.. ఆ బురదను తమకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేస్తే భవిష్యత్తులో ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తాను క్షుద్రపూజలు చేయిస్తున్నానని ఆరోపించిన కాంగ్రెస్‌ నేతలపై పరువునష్టం దావా వేసిన హరీశ్‌రావు.. ఈ కేసు విచారణకు గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 30న తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తామని కోర్టు చెప్పిందన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు లాంటిదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడాలని స్పీకర్‌ ప్రయత్నించారని, కానీ.. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు ఆ ఎమ్మెల్యేలకు గుణపాఠంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా వారికి కనువిప్పు కలగాలన్నారు. రాజ్యాంగ సంరక్షకుడిగా వ్యవహరిస్తానన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇప్పుడేమి చేస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఆయన రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన ఆరు గ్యారంటీల అమలు ఏమైందని హరీశ్‌రావు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ నియామకం జరగలేదని, సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినా స్పీకర్‌ పట్టించుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు మాటలతో కాలం గడుపుతున్నారని, రాష్ట్రం తిరోగమనం దిశలో పయనిస్తోందని విమర్శించారు. ఎల్‌నినో పేరు చెప్పి చేతులు దులుపుకొంటున్నారని, ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీస్తే సహించలేక పోతున్నారని అన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:42 AM