గోల్డ్ రష్
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:16 AM
‘ఇప్పటికే ఆలస్యం చేశాం! ఇప్పటికైనా కొనకపోతే నష్టపోతాం! మంచి తరుణం... మించిన దొరకదు! కొంత బంగారం, ఇంకొంత వెండీ కొనేద్దాం!’.... ఇదీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్! సామాన్య, మధ్య తరగతిని పక్కనపెడితే...
బంగారం, వెండి కొనుగోలుకు జనం పరుగు
ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు
షాపుల ముందు క్యూ కట్టి మరీ కొనుగోళ్లు
నగల కంటే బిస్కెట్లు, బార్ల కొనుగోలుకే మొగ్గు
పాత బంగారం తాకట్టు పెట్టి మరీ ‘పెట్టుబడులు’
రియల్ ఎస్టేట్ కోసం దాచిన సొమ్ములూ మళ్లింపు
(ప్రొద్దుటూరు/హైదరాబాద్ సిటీ - ఆంధ్రజ్యోతి)
‘ఇప్పటికే ఆలస్యం చేశాం! ఇప్పటికైనా కొనకపోతే నష్టపోతాం! మంచి తరుణం... మించిన దొరకదు! కొంత బంగారం, ఇంకొంత వెండీ కొనేద్దాం!’.... ఇదీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్! సామాన్య, మధ్య తరగతిని పక్కనపెడితే... ఎప్పటికప్పుడు ‘పెట్టుబడి సాధనాల’పై కన్నేసి ఉంచే వారంతా బంగారం వెంట పడుతున్నారు. ఎంతగా అంటే... దుకాణాల ముందు క్యూల్లో నిలబడి, రెండుమూడు గంటలు వెయిట్ చేసేంత! ఇంట్లో అప్పటికే ఉన్న పాతబంగారాన్ని బ్యాంకులో కుదువ పెట్టి, ఆ డబ్బుతో కొత్తగా బంగారం కొనేంత! బులియన్ మార్కెట్‌లో ‘సెకండ్ బాంబే’గా పేరుపొందిన కడప జిల్లా ప్రొద్దుటూరులో, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరిన్ని నగరాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. రెండు మూడు నెలలుగా బంగారు, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. ‘ఇంతకంటే పెరగదు’ అనుకున్న ప్రతిరోజూ మరింత పైకి ఎగబాకుతున్నాయి. దీంతో... ‘అప్పుడే కొని ఉంటే బాగుండేది’ అని అనుకునేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత పది రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.32 వేలకుపైగా పెరిగింది. కిలో వెండి ధర రూ.96 వేలకుపైగా పెరిగింది. తులం బంగారం రూ.2.50 లక్షలు, కిలో వెండి రూ.5 లక్షలు దాటుతుందనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీంతో... ఈ ట్రెండ్‌ను ఇప్పుడైనా ‘క్యాష్’ చేసుకుందాం అనే ‘గోల్డ్ రష్’ విపరీతంగా పెరిగింది. చేతిలో డబ్బు లేకుంటే ఇంట్లో ఉన్న నగలను బ్యాంకుల్లో తనఖా పెట్టి వచ్చిన డబ్బుతో బంగారం, వెండి కొనేస్తున్నారు. మూడు వారాలుగా బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ సంఖ్య పెరిగాయని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి ఒకరు చెప్పారు. ప్రొద్దుటూరులో గురువారం పలు బ్యాంకు శాఖలు భారీ స్థాయిలో ‘గోల్డ్ లోన్’లు మంజూరు చేశాయి. ఒక వ్యక్తి బంగారు నగలు తనఖాపెట్టి లోన్ ఇవ్వాలని బ్యాంకుకు వెళ్లగా... ‘ఈరోజు ఇప్పటికే రూ.2 కోట్లు గోల్డ్‌లోన్లు ఇచ్చేశాం. ఇక నగదు లేదు’ అని పంపించేశారు. మరో బ్యాంకు శాఖలోనూ ఇదే అనుభవం ఎదురైంది. బంగారం తనఖా పెట్టి ‘అగ్రికల్చర్ లోన్’ తీసుకున్న ఒక వ్యక్తి... ‘పాత లోన్ రెన్యువల్ చేస్తాను. అదే బంగారానికి అదనంగా వచ్చే డబ్బును అప్పుగా ఇవ్వండి’ అని అడిగితే, ‘నో క్యాష్’ అని బ్యాంకు సిబ్బంది చెప్పారు.
ఇదే ‘రియల్’...
గతంలో రియల్ రంగంలో పెట్టుబడి పెట్టే వారు కూడా ప్రస్తుతం బంగారం, వెండివైపు మారిపోయారు. హైదరాబాద్ నగరంలోని చెంగిచెర్లలో ఇళ్లు నిర్మించి విక్రయించే ఓ బిల్డర్.. ఇటీవల పావు కిలో బంగారం, ఐదు కిలోల వెండి కొనుగోలు చేశాడు. ‘‘ఇల్లు కట్టి ఏడాదికో, ఏడాదిన్నరకో అమ్మితే రూ.10- 15 లక్షలు మిగిలితే ఎక్కువ. బంగారం, వెండితో రోజుల్లోనే అంత లాభం వస్తోంది’’ అనేది ఆయన వాదన. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రియల్ ఎస్టేట్‌లో స్తబ్ధత నెలకొంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి కోసం దాచుకున్న నగదునూ బంగారు, వెండి కొనుగోలుకు వాడే వారి సంఖ్య పెరిగింది.
ప్రొద్దుటూరులో గురువారం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.85,500. అయితే... గురువారం ఈ ధరకు గోల్డ్ బిస్కెట్ దొర లేదు. ధర మరింత పెరుగుతుందనే ‘బలమైన నమ్మకం’తో గురువారం రాత్రి తులం బంగారం రూ.2 లక్షల నుంచి 2.10 లక్షలు ఇచ్చి ‘బుకింగ్’ చేసుకున్నట్లు తెలిసింది.