కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:26 AM
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ‘గోదావరి పుష్కరాలు-2027’ క్యాబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది....
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది.. 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాల నిర్వహణ
8 కోట్ల మంది తరలివస్తారని అంచనా
ప్రముఖ ఆలయాలను అనుసంధానిస్తూ పుష్కరాలకు 96 ప్రాంతాల ఎంపిక
‘తెలంగాణ బ్రాండ్’ మార్మోగేలా పనులు
ఈ నెల చివరినాటికి డీపీఆర్‌లు పూర్తి
పుష్కరాల క్యాబినెట్ సబ్‌కమిటీ తొలి సమావేశంలో వెల్లడించిన మంత్రులు
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ‘గోదావరి పుష్కరాలు-2027’ క్యాబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ మార్మోగేలా... మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన సబ్ కమిటీ తొలి సమావేశంలో సభ్యులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. పుష్కరాల నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సరస్వతీ పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిందన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే గోదావరి పుష్కరాలనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహించాలని పండితులు నిర్ణయించారన్నారు. సుమారు 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు వచ్చే అవకాశముందని, గోదావరి ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ఎంపిక చేశామని తెలిపారు. ఆయా చోట్ల ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర, జిల్లా ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వేగంగా పనుల్ని ప్రారంభించాలని, ఈ నెల చివరి నాటికి డీపీఆర్ పూర్తి చేయాలని నిర్దేశించుకున్నామని తెలిపారు. తొలి దశలో రద్దీ అధికంగా ఉండే 9 ప్రాంతాలను ‘టైర్-1’ కింద ఎంపిక చేశామన్నారు. పుష్కరాల నిర్వహణకు స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తామని తెలిపారు.
బాసర నుంచి భద్రాచలం వరకు సర్క్యూట్..
గోదావరి పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాల్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసేలా సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి నిధుల అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. బాసర, భద్రాచలం, కొండగట్టు వంటి ప్రసిద్ధ క్షేత్రాలు, ఇతర ప్రముఖ దేవాలయాలకు సౌకర్యవంతమైన రోడ్ల కనెక్టివిటీ కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రధాన రహదారుతో ఆలయాలను అనుసంధానం చేస్తూ ఒకేసారి సమగ్ర ప్రణాళిక అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.