Share News

ఘోష్‌ కమిషన్‌ వేసినప్పుడే కేసీఆర్‌ ఎందుకు కోర్టుకెళ్లలేదు?

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:42 AM

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్‌ సహా నలుగురు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి....

ఘోష్‌ కమిషన్‌ వేసినప్పుడే కేసీఆర్‌ ఎందుకు కోర్టుకెళ్లలేదు?

  • నివేదికను మాత్రం సవాలు చేశారు

  • హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు

  • సుదీర్ఘ వాదనలపై ధర్మాసనం మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్‌ సహా నలుగురు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం అడ్వకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ ప్రాజెక్టు గురించి అన్ని విషయాలూ కేసీఆర్‌కు తెలుసని, అయినా ఈ పిటిషన్‌ దాఖలు చేశారని చెప్పారు. విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కమిషన్‌ వేసినప్పుడు వెంటనే దానిని కోర్టులో సవాల్‌ చేశారని గుర్తుచేశారు. కానీ కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చే వరకు కేసీఆర్‌ వేచిచూశారని, కమిషన్‌ ఏర్పాటుపై కోర్టుకు వెళ్లలేదని చెప్పారు. కేసీఆర్‌ తన ప్రమాణపత్రాల్లో ఎక్కడా సాక్షులు చెప్పిన వాంగ్మూలాలు తనకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొనలేదని అన్నారు. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ అవకాశం కోరలేదని పేర్కొన్నారు. నివేదిక ఇచ్చిన తర్వాత కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్ట్‌ సెక్షన్‌ 8-బీ, సెక్షన్‌ 8-సీ నోటీసులు ఇవ్వలేదనడం సమంజసంకాదన్నారు. ప్రభుత్వం తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ఎస్‌. నిరంజన్‌రెడ్డి వాదిస్తూ.. ఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియపై ప్రధానంగా దృష్టిసారించిందని చెప్పారు. అయితే కేవలం నలుగురు మాత్రమే హైపర్‌ సెన్సిటివ్‌గా వ్యవహరిస్తూ హైకోర్టుకు వచ్చారని పేర్కొన్నారు. వారు కూడా నివేదికలో విధానపరమైన లోపాలు ఉన్నాయంటూ వ్యతిరేకిస్తున్నారే తప్ప.. ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను, అధిక ఖర్చులను, ఖజానాకు నష్టం జరిగిన విషయాలపై అభ్యంతరం చెప్పడం లేదని తెలిపారు. ప్రభుత్వం తరఫున మరో సీనియర్‌ న్యాయవాది శ్రీరఘురాం వాదిస్తూ.. పిటిషనర్‌ స్మితా సబర్వాల్‌ ఎవరో చెప్పి పంపించినట్లుగా కమిషన్‌ ఎదుటకు వచ్చారని, తప్పించుకునే రీతిలో సమాధానాలు ఇచ్చారని తెలిపారు. వివిధ విభాగాల మధ్య ఫైళ్ల కదలికపై, జీవోలు, నిధుల విడుదలపై ప్రశ్నలు అడిగినప్పుడు తనకు ఏమీ తెలియదని సమాధానాలు ఇచ్చారని అన్నారు. తెలియని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు ఆమె సమయం కూడా కోరలేదని.. పైగా ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే మళ్లీ హాజరవుతానని కూడా చెప్పారని వివరించారు. సుదీర్ఘంగా వాదనలు సాగడంపై మరోసారి ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేస్తూ ఆరోజు వాదనలు పూర్తికావాలని ఆదేశించింది. మరో వాయిదా ఇవ్వబోమని స్పష్టం చేసింది.

Updated Date - Mar 06 , 2026 | 03:42 AM