స్టీల్ బ్రిడ్జి కాంట్రాక్టు సంస్థకు నోటీసులు..!
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:10 AM
సంతోష్‌నగర్- సైదాబాద్ స్టీల్ వంతెన నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న నిర్మాణ సంస్థ ఎంవీఆర్ ....
పనుల్లో నిర్లక్ష్యంపై జీహెచ్‌ఎంసీ ఆరా
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
హైదరాబాద్ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): సంతోష్‌నగర్- సైదాబాద్ స్టీల్ వంతెన నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న నిర్మాణ సంస్థ(ఎంవీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్)కు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. వాహనాల రాకపోకలు సాగుతోన్న సమయంలోనే.. కనీస రక్షణ చర్యలు లేకుండా పనులు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది. స్టీల్ వంతెనపై గర్డర్ల మధ్య బ్రేసింగ్‌లు అమర్చుతున్నప్పుడు కింద వాహనాల వెళ్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ప్రజల ప్రాణాలంటే చులకనా..?’’ అనే కథనానికి అధికారులు స్పందించారు. కార్మికులకు సేఫ్టీ బెల్టులు, హెల్మెట్లు వంటి రక్షణ పరికరాలు లేకపోవడం.. కింద వెళ్లే పాదచారులు, వాహనదారుల రక్షణ కోసం నెట్లు ఏర్పాటు చేయకపోవడం ఐఎ్‌సఓ 45001 నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నోటీసుల నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థ అప్రమత్తమై.. రక్షణ నెట్లు ఏర్పాటు చేయడంతో పాటు కార్మికులకు భద్రతా పరికరాలు అందించినట్లు ఓ అధికారి తెలిపారు. కాగా, స్టీల్ వంతెన నిర్మాణ పనుల వద్ద ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ), ఈఈ స్థాయి అధికారులు నిరంతరం సైట్‌ను తనిఖీచేయాల్సి ఉన్నా.. వారు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ ప్రాజెక్టుల వద్ద నిర్మాణ సంస్థలు సరైన రక్షణ చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టీల్ బ్రిడ్జి పనుల్లో నిర్లక్ష్యానికి సంబంధించి ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకోకుండా అధికారులు కేవలం నోటీసులతో సరిపెట్టడం గమనార్హం.