Share News

గరోండ బిల్డర్స్‌కు మూడేళ్ల జైలు

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:21 AM

అపార్ట్‌మెంట్‌లు కడతామని చెప్పి, అమాయకులను మోసం చేసిన గరోండ బిల్డర్స్‌ యజమానులకు వినియోగదారుల ఫోరం- 2 గురువారం శిక్ష విధించింది.....

గరోండ బిల్డర్స్‌కు మూడేళ్ల జైలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): అపార్ట్‌మెంట్‌లు కడతామని చెప్పి, అమాయకులను మోసం చేసిన గరోండ బిల్డర్స్‌ యజమానులకు వినియోగదారుల ఫోరం- 2 గురువారం శిక్ష విధించింది. బాధితుల నుంచి తీసుకున్న సొమ్మును వడ్డీతో చెల్లించాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను అమలు పరచడంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినందుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ముద్దాయిల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. గరోండ బిల్డర్స్‌ భాగస్వాములు సునీల్‌ సచ్‌దేవ్‌, ఆయన భార్య, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేఖా సచ్‌దేవ్‌, కుమార్తెలు రూపాల్‌ సాగి, మీనల్‌ ధృవ్‌లకు ఈ శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏ కేసులో కూడా ఫోరం ముగ్గురు మహిళలకు మూడేళ్ల జైలు శిక్ష విధించలేదని, అసలు ఫోరం తీర్పుల్లో మహిళలకు జైలు శిక్ష విధించడం అరుదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో గంగ, యమున, గోదావరి, కావేరి పేర్లతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నామని ప్రచారం చేసి కోట్లు వసూలు చేశారు. కనీసం నిర్మాణాలు చేపట్టకుండా సేకరించిన డబ్బును సొంత అవసరాలకు వాడుకున్నారు. త్వరలో రిజిస్ట్రేషన్‌లు చేస్తామంటూ మభ్యపెట్టడంతో పాటు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించకుండా జాప్యం చేశారు. ఈ సంస్థ వద్ద ప్లాట్‌ కొనుగోలు కోసం హెచ్‌. నారాయణ, విద్య దంపతులు రూ.14.90 లక్షలు చెల్లించి మోసపోయారు. బాధితులు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయగా.. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం బాధితులకు రూ.14.90 లక్షలతోపాటు ఏటా 12శాతం వడ్డీ కలిపి చెల్లించాలని, మన్‌వేదనకు గురిచేసినందుకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని గతంలోనే తీర్పును వెలువరించింది. జిల్లా పోరం తీర్పును సవాలు చేస్తూ యజమానులు రాష్ట్ర ఫోరంలో అప్పీలు చేయగా అక్కడ నిరాశ ఎదురైంది. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, డబ్బులు చెల్లించలేనని సునీల్‌ సచ్‌దేవ్‌ కోర్టులో దివాళా పిటిషన్‌ దాఖలు చేశారు. కెన్యా పారిపోయే యత్నంలో ఉన్నట్లు గుర్తించిన బాధితులు ఫోరంలో ఫిర్యాదు చేయగా వారి పాస్‌పోర్ట్‌లను సైతం రద్దు చేసింది. దాంతో సునీల్‌ సచ్‌దేవ్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ వినియోగదారుల ఫోరం-2 జనవరి 29న తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం సునీల్‌ జైలులోనే ఉండడం, సొమ్ము చెల్లించాలన్న ఫోరం ఆదేశాలు ఇప్పటికీ అమలు కాకపోవడంతో సునీల్‌ భార్య రేఖ, కుమార్తెలు రూపాల్‌ సాగి, మీనల్‌ ధృవ్‌లకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ వినియోగదారుల ఫోరం-2 గురువారం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Mar 06 , 2026 | 03:21 AM