గ్యాస్ సంక్షోభంతో.. పచ్చిపులుసు, పచ్చళ్లతో సరి..
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:36 AM
ఇరాన్ యుద్ధ ప్రభావం పరిశ్రమల్లోని క్యాంటీన్లపై పడింది. వంట గ్యాస్ సంక్షోభంతో క్యాంటీన్ల నిర్వాహకులు టిఫిన్లు, కూరలు, చపాతీలకు కోత విధించారు.
గ్యాస్ సంక్షోభంతో పచ్చిపులుసు, పచ్చళ్లతో సరి.. పరిశ్రమల్లోని క్యాంటీన్లపైనా యుద్ధం ప్రభావం
టిఫిన్లూ లేవు... కడుపు మాడుతున్న కార్మికులు.. కొన్నిచోట్ల స్టీమ్ పైపు లైన్ వేడితో వంటకాలు
పటాన్‌చెరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఇరాన్ యుద్ధ ప్రభావం పరిశ్రమల్లోని క్యాంటీన్లపై పడింది. వంట గ్యాస్ సంక్షోభంతో క్యాంటీన్ల నిర్వాహకులు టిఫిన్లు, కూరలు, చపాతీలకు కోత విధించారు. చారు, సాంబారు, పులుసులు వంటివి చేయడం కూడా మానుకున్నారు. చల్లటి నీళ్లు తయారుచేసే పచ్చిపులుసు, కూరగాయల పచ్చళ్లతో భోజనం పెడుతున్నారు. దాంతో కార్మికులు అర్ధాకలితో అవస్థలు పడకతప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం పరిశ్రమల్లో క్యాంటీన్లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని అరబిందో, ఎంఎ్‌సఎన్, రెడ్డీస్ ల్యాబ్స్ వంటి పరిశ్రమల్లో యాజమాన్యాలు క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించాయి. ఉత్తరాదికి చెందిన కార్మికులకు భోజనంలో చపాతీలు తప్పనిసరి. చపాతీలు తయారుచేయడానికి గ్యాస్ ఎక్కువ ఖర్చవుతుందని, ఐదు చపాతీలు కాల్చడానికి అయ్యే గ్యాస్‌తో 40 ఇడ్లీలు ఉడకబెట్టవచ్చని క్యాంటీన్ల నిర్వాహకులు లెక్కలు వేస్తున్నారు. దాంతో భోజనంలో చపాతీలకు కోత విధించారు. భోజనం కూడా ఆచితూచి పెడుతున్నారు. కొన్నిచోట్ల కూరలు కూడా వడ్డించడం లేదు. మెనూ నుంచి సాంబారు, చారు, పులుసులను తొలగించి.. గ్యాస్ వాడాల్సిన అవసరం లేని పచ్చిపులుసు, కూరగాయల పచ్చళ్లతో సరిపెడుతున్నారు. పలుచోట్ల టిఫిన్లను బంద్ చేశారు. అర్ధాకలితోనే పనిచేస్తున్నామని, క్యాంటీన్లతో అరకొర భోజనమే పెడుతున్నా ధరలు పెంచడం భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచే మూడు పూటలకు సరిపడా భోజనం తెచ్చుకుంటున్నామని పలువురు కార్మికులు తెలిపారు. వంట గ్యాస్ సంక్షోభంతో కొన్ని పరిశ్రమల్లోని క్యాంటీన్లలో వంటచేసే విధానంలో మార్పులు చేశారు. గ్యాస్‌కు బదులు ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరిస్తున్నారు. రసాయనాలను వేడి చేయడానికి వినియోగించే స్టీమ్ పైపులైన్లను వంటశాలల్లో అమరుస్తున్నారు. బాయిలర్ కింద బొగ్గులతో మంట పెట్టి నీళ్లను వేడి చేస్తారు. తద్వారా విడుదలయ్యే ఆవిరిని రియాక్టర్‌లోకి పంపుతారు. ఆవిరితో రసాయనాలను వేడి చేస్తారు. అదే పద్ధతిని వంటశాలల్లో వినియోగిస్తున్నారు. కట్టెలు, బొగ్గు కలిపి తయారుచేసే బ్రికెట్స్ కూడా వాడుతున్నారు. ఇటుక ఆకారంలో ఉండే బ్రికెట్స్‌ను మండించినప్పుడు అధిక వేడిని విడుదల చేస్తాయి.