Share News

వేళాపాళా లేకుండా లాగిన్‌!

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:28 AM

వేళాపాళా లేదు.. అర్ధరాత్రి, తెల్లవారుజాము.. పండగలుపబ్బాలు.. సెలవు రోజులు.. ఏమీ పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా లాగిన్‌ అయి, అవసరమైన వారికి భూమిని బదలాయించేశారు!

వేళాపాళా లేకుండా లాగిన్‌!

  • అర్ధరాత్రి, తెల్లవారుజాము, పండగలు,

  • సెలవు రోజులు.. ఎప్పుడంటే అప్పుడు లావాదేవీలు

  • అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు డిలీట్‌

  • 12 అవకతవకలను గుర్తించిన ధరణి ఫోరెన్సిక్‌ ఆడిట్‌

  • ప్రాథమిక నివేదికలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి

  • సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోనే భారీగా అవకతవకలు

  • ధరణి అక్రమాలపై సీఐడీ విచారణకు సర్కారు యోచన?

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్ర జ్యోతి): వేళాపాళా లేదు.. అర్ధరాత్రి, తెల్లవారుజాము.. పండగలుపబ్బాలు.. సెలవు రోజులు.. ఏమీ పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా లాగిన్‌ అయి, అవసరమైన వారికి భూమిని బదలాయించేశారు!! అడ్డగోలుగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్‌ చేసేశారు! భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వివరాలు గుట్టుచప్పుడు కాకుండా డిలీట్‌ చేశారు! ఇలా.. ధరణి పోర్టల్‌లో అనేక అవకతవకలు జరిగినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ప్రాథమిక నివేదికలో గుర్తించారు. తొలుత ప్రయోగాత్మకంగా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన ధరణి ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో బయటపడ్డ అవకతవకలను చూసి, అధికారులు విస్తుపోయారు. దాదాపు 12 రకాల లొసుగులను గుర్తించారు. రెండు జిల్లాల్లోనే ఇన్ని అక్రమాలకు పాల్పడితే ఖరీదైన భూములున్న రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మెదక్‌ జిల్లాల్లో ఇంకెన్ని జరిగి ఉంటాయోనని అనుమానిస్తున్నారు. ఇటీవల ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ప్రాథమిక నివేదికను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి అందజేశారు. దానిపై మంత్రి రెవెన్యూ అధికారులతో చర్చించారు. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత, తెల్లవారుజామున 3 గంటలకు, 4 గంటలకు, పండగలు, సెలవు రోజులు.. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అడ్డగోలుగా భూముల బదలాయింపు జరిగినట్లు ఆడిట్‌లో తేలింది. ఎవరు లాగిన్‌ అయ్యారు? ఎవరి కోసం చేసి ఉంటారు? అన్నది తేలాల్సి ఉంది. లాగిన్‌, రిజిస్ట్రేషన్‌ వివరాలను డిలీట్‌ చేయడంతో మరిన్ని సందేహాలకు తావిస్తోందని అధికారులు చెబుతున్నారు.


తొలగించాల్సిన అవసరం ఏంటో?

భూముల లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న లాగిన్లు, డిలీట్‌ చేసిన రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని ఎలా సేకరించాలనేదానిపై ఐటీ అధికారులు, రెవెన్యూ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. తొలగించిన సమాచారాన్ని సేకరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించడంతో ఆ దిశగా రెవెన్యూ, ఎన్‌ఐసీ, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. రెండు జిల్లాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని, అందుకోసం ఇష్టానుసారంగా లాగిన్‌ అయ్యారని ఆడిట్‌ నివేదికలో ప్రస్తావించారు. లాగిన్‌ అయిన కంప్యూటర్ల ఐపీ అడ్ర్‌సలను అధికారులు సేకరించారు. ఆ కంప్యూటర్లు ఎవరి అధీనంలో ఉన్నాయి? ఎవరి ఆదేశాల మేరకు ఆ సమయాల్లో లాగిన్‌ అయ్యారనే వివరాలను సేకరిస్తున్నారు. భూముల లావాదేవీల వివరాలను చాలా వరకు డిలీట్‌ చేయడంతో దీని వెనక ఎవరున్నారనే కోణంలో సీఐడీతో విచారణ జరిపించాలన్న యోచనలో సర్కారు ఉన్నట్లు తెలిసింది. ఇక ధరణి పోర్టల్‌లో తొలగించిన సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. రోజువారీ బ్యాకప్‌, ఇంక్రిమెంటల్‌ బ్యాకప్‌, డిజాస్టర్‌ రికవరీ కాపీస్‌ పద్ధతిలో డేటా సేకరించే అవకాశం ఉంది. పోర్టల్‌లో ప్రతి మార్పునూ గుర్తించే వీలుంటుంది. ఎవరు ఎడిట్‌ చేశారు? ఎప్పుడు డిలీట్‌ చేశారు? ఏ ఐపీ/యూజర్‌ లాగిన్‌ ద్వారా చేశారు? దానికి ముందు డేటా ఏముంది? వంటి వివరాలన్నీ లాగ్‌ ఫైల్స్‌లో దొరుకుతాయి.

లక్షల ఎకరాలు చేతులు మారినట్లు ఆరోపణలు

2014 నుంచి 2023 మధ్య కాలంలో అటవీ భూములు, దేవాదాయ, వక్ఫ్‌, భూదాన్‌ భూములకు సంబంధించి లక్షల ఎకరాల రికార్డులు తారుమారు చేసి ఆ భూములు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. 2014కు ముందు ఉన్న భూములకు, 2023 తర్వాత ఉన్న భూముల వివరాలకు పొంతన లేకుండా పోయిందనేది ప్రభుత్వ వాదన. 2014కి ముందు రిజిస్ట్రేషన్‌ శాఖ వద్ద ఉన్న నిషేధిత భూముల జాబితాలను తీసుకొని ఆడిట్‌ చేస్తామని రెవెన్యూ శాఖ గతంలోనే స్పష్టం చేసింది. రెండు జిల్లాల్లో నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో పలు అభ్యంతరాలను అధికారులు గుర్తించారు. ఖరీదైన భూములున్న రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌ జిల్లాల్లో ఈ తరహా మోసాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో అసైన్డ్‌ భూములు 22.68 లక్షల ఎకరాలు ఉండగా.. ఇవి కూడా మాయమైపోయాయనే అనుమానాలు ఉన్నాయి. 2017లో భూరికార్డుల నవీకరణకు ముందు పట్టాభూములు 1.30 కోట్ల ఎకరాలు ఉంటే 2020 అక్టోబరు 23 నాటికి ఈ లెక్క 1.55 కోట్ల ఎకరాలకు చేరింది. పట్టా భూముల జాబితాలో ఏకంగా 25 లక్షల ఎకరాలు చేరాయి. ఈ 25 లక్షల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది తేలాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2023లో కాంగ్రెస్‌ అధికారం చేపట్టే వరకు అర్ధరాత్రుళ్లు జరిగిన రిజిస్ట్రేషన్ల నుంచి భూములు ఎవరి చేతులు మారాయో ప్రజల ముందు పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ఇవ్వనున్న పూర్తి స్థాయి నివేదికకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

Updated Date - Jan 29 , 2026 | 05:28 AM