ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమి ఇవ్వం
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:51 AM
రంగారెడ్డి జిల్లా యాచారం మం డలం కొత్తపల్లిలో అసైన్డ్ భూముల చుట్టూ కంచె వేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
అధికారులను అడ్డుకున్న రైతులు.. కొత్తపల్లిలో ఉద్రిక్తత
దిమ్మెల సామగ్రి స్వాధీనం.. పంచాయతీకి తరలింపు
యాచారం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా యాచారం మం డలం కొత్తపల్లిలో అసైన్డ్ భూముల చుట్టూ కంచె వేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మంగళవారం రాత్రి దిమ్మెల నిర్మాణం కోసం అధికారులు తెచ్చిన ఇనుప డబ్బాలను రైతులు స్వాధీనం చేసుకుని, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉంచా రు. గ్రామంలోని అసెన్డ్ భూములను ఇటీవల రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు సర్వే చేయించారు. మంగళవారం ఉదయం ఆ భూముల చుట్టూ గుంతలు తీయించడానికి వచ్చిన అధికారులను, జేసీబీని రైతులు అడ్డుకున్నారు. సర్వే నెం.32, 178, 182, 222, 242, 317లో 2,200 ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఇందులో 150 మంది రైతులకు చెందిన 600 ఎకరాలున్నాయి. ఈ భూములను ఫ్యూచర్ సిటీ కోసం తీసుకునేందుకు సర్వే చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాలతో వాటి హద్దుల గుర్తింపు కోసం గుం తలు తీయిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ప్రాణాలైనా ఇస్తాం కానీ సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. వారి ఆందోళన మధ్యే అధికారులు గుంతలు తీయించారు. రాత్రి అధికారులు ఇనుప డబ్బాలను గ్రామంలోకి తెస్తున్నట్లు రైతులు తెలుసుకొని వారిని అడ్డుకుని, వాటిని స్వాధీనం చేసుకొని గ్రామ పంచాయతీలో ఉంచారు. అధికారులు గ్రామసభ పెట్టి పరిహారం విషయం తేల్చేవరకు భూముల జోలికి రావొద్దని తేల్చిచెప్పారు. దాంతో అధికారులు వెనుదిరిగారు.