స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన శ్రీపాద
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:45 AM
స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాదరావు అని కర్ణాటక శాసనసభ స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ కొనియాడారు. రాజకీయాల్లో పదవి నెత్తిన పెట్టుకునే కిరీటం కాదని..
కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్
దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు
హైదరాబాద్, మార్చి 2(ఆంధ్రజ్యోతి): స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాదరావు అని కర్ణాటక శాసనసభ స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ కొనియాడారు. రాజకీయాల్లో పదవి నెత్తిన పెట్టుకునే కిరీటం కాదని.. అదొక బాధ్యత అని చాటిచెప్పిన దార్శనికుడన్నారు. సోమవారం హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫరీద్ మాట్లాడుతూ సర్పంచ్ నుంచి స్పీకర్ స్థాయికి ఎదిగిన శ్రీపాదరావు రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాప్రతినిధి సరిగ్గా పనిచేయకపోతే వెనక్కి పిలిచే రీకాల్ విధానాన్ని ఆయన సమర్థించారన్నారు. సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమాయకులను రక్షించేందుకు రాజ్యాంగ పరిధిలో ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. ప్రజా క్షేత్రంలో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే నైతిక విలువల్ని తన తండ్రి శ్రీపాదరావు వారసత్వంగా ఇచ్చారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తనను నమ్ముకున్న ఒక సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్తూ, ప్రజల మధ్యే ఆయన అమరుడయ్యారన్నారు.