కుక్కకైనా టికెట్ ఇస్తా కానీ నీకు ఇవ్వను!
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:00 AM
మునిసిపల్ ఎన్నికల వేళ దుబ్బాక బీఆర్‌ఎస్ పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ‘కుక్కకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా..
దుబ్బాక బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడికి చేదు అనుభవం.. మాజీ చైర్‌పర్సన్ వ్యాఖ్యలతో మనస్తాపం.. పార్టీకి రాజీనామా
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ప్రత్యర్థులుగా తండ్రీ కొడుకులు
నల్లగొండ/శంకర్‌పల్లి/ దుబ్బాక, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల వేళ దుబ్బాక బీఆర్‌ఎస్ పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ‘కుక్కకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా..నీకు మాత్రం ఇవ్వను’ అంటూ మాజీ మునిసిపల్ చైర్‌పర్సన్ గన్నే వనితారెడ్డి తనను దూషించారంటూ దుబ్బాక బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. దుబ్బాక 18వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వు అవ్వగా.. ఆ స్థానంలో తన భార్యను బరిలోకి దించాలని వంశీకృష్ణ గౌడ్ భావించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిసి టికెట్ కోరగా.. మాజీ మునిసిపల్ చైర్‌పర్సన్ గన్నె వనితారెడ్డిని ఒప్పించుకోవాలని సూచించినట్టు సమాచారం. అయితే, వంశీకృష్ణ గౌడ్ సతీమణిని కాకుండా వనితారెడ్డి మరొకరిని బరిలో నిలిపారు. విషయం హరీశ్‌రావు చెంతకు చేరగా టికెట్ల కేటాయింపులో కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వండంటూ ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు సూచించారు. దీంతో బక్కి వెంకటయ్య మరోసారి వనితారెడ్డిని కలవమని వంశీకృష్ణ గౌడ్‌కు సూచన చేశారు. దీంతో వంశీకృష్ణగౌడ్ వనితారెడ్డిని కలిశారు. అయితే, ఆమె.. కుక్కకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా కానీ నీకు మాత్రం ఇవ్వనని చెప్పారని వంశీకృష్ణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మునిసిపాలిటీలో తండ్రీకొడుకులు ఒకరిపై ఒకరు పోటీకి దిగారు. 12వ వార్డులో బీఆర్‌ఎస్ నుంచి దండు సంతోష్ కుమార్ 2రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తండ్రి దండు రాజేశ్వర్ శుక్రవారం కాంగ్రెస్ నుంచి అదే వార్డుకు నామినేషన్ వేశారు. సంతోష్ శుక్రవారం మరో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. భువనగిరి మునిసిపాలిటీలోని 32వ వార్డుకు బాలింత బర్రె సంఘవి పసిపాపతో వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో నల్లగొండ జిల్లా చండూరులో 9వ వార్డుకు చెందిన కార్యకర్త భూతరాజు వేణు పురుగు మందు తాగగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
మున్సిపల్ బరిలో ట్రాన్స్‌జెండర్
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికలలో ఓ ట్రాన్స్‌జెండర్ బరిలోకి దిగారు. ఒకటో వార్డుకు శివనేనిగూడెం నుంచిట్రాన్స్‌జెండర్ నాగిళ్ల కావేరి (సుధాకర్)స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
ఎన్నికల బరిలో కల్నల్ సంతో్‌షబాబు తల్లి
అమర సైనికుడుకల్నల్ సంతో్‌షబాబు తల్లి బిక్కుమళ్ల మంజుల సూర్యాపేట మునిసిపాలిటీలోని 44వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మంజుల తెలిపారు.
28,456 నామినేషన్లు.. ముగిసిన స్వీకరణ గడువు
రాష్ట్ట్రంలోని మునిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో ఉన్న మొత్తం 2,996 వార్డులకు గాను 28,456 మంది నామినేషన్లు దాఖలు చేశారు.