డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ!
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:39 AM
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి ఆస్తుల పంచాయితీ ఉందా? వివాదాస్పద బినామీ పెట్టుబడిదారుడైన కేదార్ మరణం తర్వాత..
డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ!రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో దుబాయి ఆస్తులపై చర్చ
కేదార్ ద్వారా దుబాయిలో ప్రముఖుల పెట్టుబడులు!
నాడు అనుమానాస్పద స్థితిలో కేదార్ మృతి
రోహిత్‌రెడ్డి అక్కడే ఉన్నట్లు ఆరోపణలు
తాజాగా ఆ పెట్టుబడులపైనే మీటింగ్
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి ఆస్తుల పంచాయితీ ఉందా? వివాదాస్పద బినామీ పెట్టుబడిదారుడైన కేదార్ మరణం తర్వాత.. ఆస్తుల పంచాయితీ తేల్చుకోవడానికే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌ్‌సను వేదికగా చేసుకున్నారా? ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది రాజకీయ నేతలతోపాటు పలువురు సినీ ప్రముఖుల కోట్లాది రూపాయల పెట్టుబడులు కేదార్ ద్వారా దుబాయిలోకి ప్రవహించాయని గతంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గతంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ రూ.వేల కోట్ల సంపాదనను కేదార్ ద్వారా దుబాయిలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కేదార్ ఒక టీవీ చానల్ యజమానికి చెందిన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆ సమయంలో రోహిత్‌రెడ్డి అక్కడే ఉన్నారని అప్పట్లోప్రచారం జరిగింది. తాజాగా రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి పలువురు ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. దుబాయిలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో తమ పెట్టుబడుల విషయంలో రోహిత్‌రెడ్డితో వీరు చర్చించినట్లు సమాచారం.

చర్చిస్తున్న సమయంలోనే ఈగల్ ప్రవేశం..
ఫాంహౌస్‌లో ఢిల్లీకి చెందిన బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, హైదరాబాద్‌కు చెందిన మరో బిజినె్‌సమ్యాన్‌తోపాటు బడా వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన రాజకీయ నేత సమావేశమై చర్చిస్తున్న క్రమంలోనే ఈగల్ పోలీసులు ఎంటరైనట్లు తెలుస్తోంది. దీంతో కాల్పులు.. హెచ్చరికలు.. అరెస్టులు.. స్టేషన్ బెయిల్స్.. రిమాండ్ మధ్య ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. గతంలో కేదార్ హైదరాబాద్‌లో ఒక లగ్జరీ బార్‌ను నిర్వహించారు. ప్రస్తుతం ఆ బార్ చేతులు, పేర్లు మారి.. మరో లగ్జరీ పబ్ నిర్వహిస్తున్న వ్యక్తికి చేరింది. ఆయన ఈ డ్రగ్స్ పార్టీలో ఉండటంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సదరు వ్యక్తి బార్, పబ్ దందానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఉండటం గమనార్హం. కాగా, కేదార్ ద్వారా దుబాయిలోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన పెద్దలు.. ప్రస్తుతం అక్కడ నెలకొన్న యుద్ధభయాల నేపథ్యంలో ఫాంహౌ్‌సలో సమావేశమైనట్లు, తమ పెట్టుబడులపై కొందరు డ్రగ్స్ సేవిస్తూ చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి హాజరైన వ్యక్తుల నేపథ్యాలు, కేదార్, రోహిత్‌రెడ్డి బంధం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫాంహౌస్!
పైలట్ రోహిత్‌రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. శనివారం రాత్రి జరిగిన పార్టీపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏలూరు ఎంపీ ఇక్కడకు వచ్చి డ్రగ్స్ తీసుకోవడంపై పోలీసు, రాజకీయ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు దాడులు నిర్వహించిన సమయంలో నాలుగు రౌండ్ల కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేకెత్తించింది. అదృష్టం కొద్దీ ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అయితే గన్ లైసెన్స్ ఒకరికి ఉంటే.. మరొకరు గన్‌తో కాల్పులు జరగడంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కేవలం భయంతో కాల్పులు జరిపారా? లేక ఇక్కడ నుంచి బయట పడేందుకా? అనేది తెలియాల్సి ఉంది. గత నెలలో కూడా ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పట్లో వచ్చిన సమాచారం మేరకే ఈసారి దాడి చేసినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ పార్టీలో ఉన్నది వీరే..
రోహిత్‌రెడ్డి- బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే
పుట్టా మహేశ్‌కుమార్- టీడీపీ ఎంపీ
నమిత్‌శర్మ- న్యూఢిల్లీలోని బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి
రితేశ్‌రెడ్డి- రోహిత్‌రెడ్డి సోదరుడు, బిజినె్‌సమ్యాన్
కౌశిక్ రవి- బెంగళూరు న్యాయవాది,
అనేక లీగల్ ఫర్మ్స్ నిర్వాహకుడు
తిరువీధుల అర్జున్‌రెడ్డి- బాబిలోన్ పబ్ యజమాని, రియల్ ఎస్టేట్ వ్యాపారి
విజయకృష్ణ నల్లపనేని- యానిమేషన్, సాఫ్ట్‌వేర్ వ్యాపారం
శ్రవణ్‌కుమార్- ప్రైవేటు ఉద్యోగి
ఎం.రమేశ్- రియల్ ఎస్టేట్ వ్యాపారి
ప్రియాంక- డాక్టర్
సిలువేరి శరత్‌కుమార్- రోహిత్‌రెడ్డి పీఏ కమ్ డ్రైవర్