కేంద్ర నిధులపై పంచాయితీ
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:47 AM
తెలంగాణలోని అధిక శాతం గ్రామ పంచాయతీల్లో బకాయి బిల్లుల చెల్లింపుపై ‘పంచాయితీ’ నడుస్తోంది. పాలక వర్గాల్లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు చెల్లించే 15వ ఆర్థిక సంఘం నిధులను .....
బకాయిల చెల్లింపుపై పాత, కొత్త సర్పంచుల మధ్య వివాదం
పాత పనుల బిల్లులు ఇచ్చేందుకు కొత్త సర్పంచుల విముఖత
పాత, కొత్త సర్పంచ్‌లు, కార్యదర్శుల మధ్య కీచులాటలు
రూ.1033 కోట్లు కేంద్ర నిధులు వచ్చినా తెగని పంచాయితీ
పంచాయతీల్లో సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు పెండింగ్
ఆ బకాయిలు చెల్లించాలన్న తాజా సర్క్యులర్‌తో మరింత సందిగ్ధం
నల్లగొండ జిల్లా ముప్పారం గ్రామ పంచాయతీకి కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.6 లక్షలు ఇటీవలే ఖాతాలో పడ్డాయి. పాలకవర్గాల్లేని రెండేళ్లలో డబ్బులు తెచ్చి అభివృద్ధి పనులు, మరమ్మతులు చేయించిన పంచాయతీ కార్యదర్శికి రూ.3.75 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని ఖాతాలోనే ఉంచారు. అయితే గతంలో గ్రామాభివృద్ధికి రూ.6 లక్షల వరకు ఖర్చు చేశానని, బకాయి మొత్తం చెల్లించాలంటూ పాత సర్పంచ్ డిమాండ్ చేస్తున్నారు. అందుకు కొత్త సర్పంచ్ సుముఖంగా లేకపోవడంతో వివాదం కొనసాగుతోంది.
హైదరాబాద్, మార్చి 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని అధిక శాతం గ్రామ పంచాయతీల్లో బకాయి బిల్లుల చెల్లింపుపై ‘పంచాయితీ’ నడుస్తోంది. పాలక వర్గాల్లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు చెల్లించే 15వ ఆర్థిక సంఘం నిధులను పెండింగ్‌లో పెట్టింది. గత ఏడాది డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన మేరకు కేంద్ర ఆర్థిక శాఖ బకాయి నిధులను చెల్లిస్తోంది. రూ.3 వేల కోట్ల వరకు బకాయి ఉంది. గత నెలలో మూడు విడతలుగా రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీల ఖతాల్లోకి కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం రూ.1033.89 కోట్లను జమ చేసింది.
మిగిలిన రూ.2 వేల కోట్లను విడతలవారీగా మార్చి 31నాటికి చెల్లించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది గ్రామాలకు ఊరట కల్పించినప్పటికీ రెండేళ్ల తర్వాత విడుదలైన ఈ నిధుల వినియోగంపై పాత, కొత్త సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నిధులను పాత బిల్లుల చెల్లింపులకు కూడా వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ, కొత్త సర్పంచ్‌లు పాత పనులకు కాకుండా కొత్త పనులకే కేటాయిస్తామని పట్టుబడుతుండటంతో వివాదం తలెత్తుతోంది. పాత సర్పంచులకు బకాయిలు చెల్లించేందుకు చాలాచోట్ల కొత్త సర్పంచులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో వివాదం ముదురుతోంది. మరికొన్నిచోట్ల ఎంబీ రికార్డులు లేకపోవడం, ఇతర కారణాలతో బకాయిల చెల్లింపునకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో పాత, కొత్త సర్పంచులు, పలుచోట్ల బదిలీపై వెళ్లిన పాత కార్యదర్శులు, ప్రస్తుత కార్యదర్శుల మధ్య కీచులాట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధుల నుంచి తక్షణమే సిబ్బంది వేతన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎ్‌ఫసీ) నిధులు విడుదల కాకపోవడం, దీనికి తోడు తగిన ఆదాయ వనరులు లేని పంచాయతీలు ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచే వారికి వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం నిదులు విడుదలైన వేళ కొత్త సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు వాటిని వేతనాలకే వినియోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరికొన్ని పంచాయతీల్లో పరిస్థితి ఇదీ..
నల్గొండ జిల్లా శాఖాపూర్ గ్రామ పంచాయతీకి రూ.4.50 లక్షల వరకు కేంద్ర నిధులు వచ్చాయి. పాలకవర్గాల్లేని రెండేళ్లలో సొంత డబ్బులు తెచ్చి అభివృద్ధి పనులు, మరమ్మతులు చేయించిన పంచాయతీ కార్యదర్శికి రూ.1.10 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని ఖాతాలోనే ఉంచారు. మూడు నెలలుగా పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించలేదు. రూ.50 వేలకు పైగా తనకు బకాయి ఉందని, చెల్లించాలంటూ పాత సర్పంచ్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో మిగిలిన నిధులను ఎటువైపు మళ్లించాలో అర్థంకాక కొత్త సర్పంచ్, కార్యదర్శి అయోమయంలో పడ్డారు.
సంగారెడ్డి జిల్లా మల్లాపూర్ గ్రామ పంచాయతీకి రూ.6.80 లక్షల వరకు కేంద్ర నిధులు వచ్చాయి. గతంలో వివిధ పనులు చేపట్టి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న పాత సర్పంచ్‌కు రూ.లక్ష, పాత కార్యదర్శికి రూ.57,500 చెల్లించారు. ఇవికాక పాత బకాయిలు రూ.6 లక్షల వరకు ఉన్నాయి. సిబ్బందికి 3 నెలలుగా వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ఎవరికి ముందు చెల్లించాలో తెలియక కొత్త సర్పంచ్, కొత్త కార్యదర్శి తలపట్టుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లా అన్నాసాగర్ పంచాయతీకి రూ.3లక్షల నిధులు వచ్చాయి. వివిధ పనులు చేపట్టినందుకు కొత్త సర్పంచుకు రూ.30 వేలు, పాలకవర్గాలు లేని సమయంలో పంచాయతీ ద్వారా చేప ట్టే పనులకు సొంతంగా ఖర్చు పెట్టినందుకు గ్రామ కార్యదర్శికి రావాల్సిన మొత్తంలో రూ.70వేలు చెల్లించారు. వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన పాత స ర్పంచుకు రూ.లక్ష వరకు బకాయి ఉంది. అంతేకాకుండా పంచాయతీ సిబ్బందికి 3 నెలలుగా వేతనా లు చెల్లించలేదు. దీంతో ముందుగా ఎవరికి చెల్లించాలో తెలియక సర్పంచ్ సందిగ్ధంలో పడ్డారు.