Share News

మేము లొంగిపోలేదు..

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:51 AM

తాము ప్రభుత్వానికి లొంగిపోలేదని, సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారని మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అన్నారు.

మేము లొంగిపోలేదు..

  • సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా అరెస్టు చేశారు

  • రిట్రీట్‌ కాలేకపోవడమే ఈ నష్టానికి కారణం

  • ఇక ప్రజాక్షేత్రంలో ఉండి చట్టబద్ధంగా పోరాడతాం

  • మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి

  • ‘ఆంధ్రజ్యోతి’తో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తాము ప్రభుత్వానికి లొంగిపోలేదని, సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారని మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అన్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి వచ్చిన వీరు.. ఇకపై ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలపై చట్టబద్ధంగా పోరాడతామని తెలిపారు. అమరుల కుటుంబాలను ఆదుకోవాలనే చైతన్య కార్యక్రమంతో తమ రాజకీయ అరంగ్రేటం మొదలవుతుందన్నారు. మావోయిస్టు పార్టీని చట్టబద్ధమైన రాజకీయ పార్టీగా గుర్తించాలని, వివిధ కారణాలతో జైళ్లలో ఉన్న మావోయిస్టులను, వారికి మద్దతుగా నిలిచిన వారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలని కోరారు. ఆపరేషన్‌ కగార్‌ తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సూచనల మేరకు రిట్రీట్‌ కాలేకపోవడం ఇంత భారీ నష్టానికి కారణమైందని చెప్పారు. ఈ మేరకు వారు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

పోలీసులు మీరు లొంగిపోయారని అంటున్నారు? మీరిప్పుడు అరెస్టు అంటున్నారు?

మాది లొంగుబాటు కాదు. కగార్‌ కొనసాగుతున్న క్రమంలో వేరే ప్రాంతానికి వెళ్లి.. పార్టీ శ్రేణులను సమీకృతం చేయడానికి వెళ్తుండగాతెలంగాణ పోలీసులు అరెస్టు చేశా రు. రాజిరెడ్డిని హన్మకొండలో, నన్ను హైదరాబాద్‌లో అదుపులోకి తీ సుకున్నారు. నిన్నటివరకు రహస్య జీవితంలో ఉన్నాం. ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చి ప్రజల కోసం లీగల్‌ ఫ్రేమ్‌లో పనిచేస్తాం.

2023 వరకు కేంద్ర కమిటీ యాక్టివ్‌గా ఉందా?

2024లో ఆపరేషన్‌ కగార్‌ మొదలైనప్పటి నుంచి వేలాది పోలీసుల మోహరింపు జరిగింది. ఇన్‌ఫార్మర్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుని, మా కదలికలపై నిఘాపెట్టారు. కాల్పులకు దిగగా కొందరు అమరులైతే మరికొందరు అరెస్టయ్యారు. ఆనాడు కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుల మధ్య సమన్వయం లేకుండాపోయింది. దీంతో ఈ పరిస్థితి వచ్చింది.


కేశవరావు ఉన్నప్పుడు లొంగుబాటుపై పార్టీలో చర్చ జరిగిందా?

అవును. అప్పట్లో శాంతిచర్చల కమిటీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అడవుల్లో మేము తిరగలేని నిర్బంధ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే సురక్షిత ప్రాంతాలకు తరలాలని నిర్ణయం తీసుకున్నాం. సాయుధ పోరాట విరమణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నంబాలను సురక్షిత ప్రాంతానికి పంపిస్తున్నప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయనతోపాటు 28 మంది మావోయిస్టులు చనిపోయారు.

సోను, ఆశన్న సాయుధ పోరాట విరమణ ప్రకటన సమిష్ఠి నిర్ణయమేనా?

లేదు. అది వారి నిర్ణయమే. పార్టీ వ్యతిరేకిస్తూ ప్రకటన చేసింది.

హిడ్మా మరణం గురించి ఎప్పుడు తెలిసింది? ఎక్కడున్నారు..?

ఆ సమయంలో మేము అడవుల్లోనే ఉన్నాం. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే క్రమంలో హిడ్మా ఎంచుకున్న వ్యక్తిపై మాకు అనుమానం కలిగి అతనితో వెళ్లవద్దని హెచ్చరించాం. ఆయన మా మాటలు పట్టించుకోకుండా వెళ్లడంతో మరణించాడు. అయితే ఆ సమయంలో విదేశాలకు మేం పారిపోవాలని అనుకోలేదు. ఇతర రాష్ట్రాల్లో తలదాచుకోవడానికి చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి మావాళ్లు వెళ్లారు. ఒకరిచ్చిన సమాచారంతోనే హిడ్మా ఎన్‌కౌంటర్‌, అరెస్టులు జరిగాయి.


లొంగుబాటుపై చర్చ జరిగిందా? కగార్‌ వల్లే లొంగిపోతున్నారా?

ప్రాణభయంతో, తూటాలకు భయపడి తీసుకున్న నిర్ణయం కాదు. ఉద్యమ బలాబలాలను బట్టి రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. ఉద్యమానికి గడ్డు స్థితి వచ్చినప్పుడు కొన్ని ఎత్తుగడలు తీసుకున్నాం. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారినప్పుడు రిట్రీట్‌ ఎత్తుగడ చేపడదామని అనుకున్నాం. కానీ, రిట్రీట్‌ అమలు చేయలేని విధంగా పరిస్థితి వచ్చింది.

వర్గ విబేధాలు, వ్యక్తుల మధ్య అంతరాల వల్లే పార్టీకి ఈ స్థితియా?

ఇది అపోహ మాత్రమే. 2023లో పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో, 2024లో పొలిట్‌బ్యూరో సమావేశంలో భిన్నాభిప్రాయాలు రాలేదు. సోను లేఖ రాసినప్పుడే భిన్నాభిప్రాయాల సమస్య వచ్చింది. సోను లేఖను నేను వ్యతిరేకించాను.

ఈ పరిస్థితికి అసలు కారణమేంటి?

2007 నుంచే పార్టీలోకి యువత, విద్యాధికులు రావడం తగ్గిపోయింది. ప్రజలకు, ఉద్యమాలకు దూరమవుతున్నామని, అడవికి, ఆదివాసీలకే పరిమితం అవుతున్నామన్న అంశంపై సరైన రాజకీయ నిర్ణయం తీసుకోవడంలో పార్టీ విఫలమైంది. సెల్‌ఫోన్ల ప్రమాదాన్ని గుర్తించి.. వాటిని వాడకూడదని అగ్రనాయకత్వం నిర్ణయించింది. కానీ, వాడిన కొందరి వల్ల నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇంత డబ్బు, బంగారం ఎలా వస్తోంది?

మాది రాజకీయ పార్టీ. ఉద్యమాన్ని నడపాలనుకున్నపుడు డబ్బు అవసరం ఉంటుంది. మాకు ఆర్థిక పాలసీ అని డాక్యుమెంట్‌ ఉంటుంది. అయితే మూడేళ్ల అవసరాలకు మించి ఎప్పుడూ నిధులు వసూలు చేయకూడదు. కానీ, రెండేళ్ల అవసరాలకు కూడా మా వద్ద నిల్వలు ఉండేవి కావు. 2 వేల మంది బలగాలతో కూడిన దండకారణ్యాన్ని నడపాలనుకుంటే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. మా దళాలకు బట్టలు, బూట్లు, ఆయుధాలు, పార్టీ ప్రచారం, వైద్యం, చదువు ఇవన్నీ అవసరాలే. వీటి నిర్వహణకు డబ్బు అవసరమే.

రాజకీయాల్లోకి రావడమంటే ఎలా?

పార్లమెంటరీ రాజకీయ పార్టీగా రాదలచుకోలేదు. ప్రజల సమస్యలపై ప్రచారం చేసి, వారిని చైతన్యం చేసి చట్టపరిధిలో పోరాటాల్లో కదిలిస్తాం. ఎంపీ, ఎమ్మెల్యే కావడం మా లక్ష్యం కాదు. సీఎం వద్ద మా పార్టీని లీగల్‌ రాజకీయ పార్టీగా గుర్తించాలనే డిమాండ్‌ పెట్టాం. అప్పుడే సాయుధ పోరాట విరమణ ప్రకటన అని చెప్పాం. మా డిమాండ్లను సీఎం ద్వారా కేంద్రానికి చెప్పించాం.


మీరు ఆయుధాలు వదిలితే నిషేధం అవసరం ఉండదని కేంద్ర హోంమంత్రి, తెలంగాణ సీఎం చెబుతున్నారు కదా!

రాజకీయ పార్టీలు తలచుకుంటే ఏమైనా జరుగుతాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులను తర్వాత తొలగించలేదా? ఏపీలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులను తర్వాత అధికారంలోకి వచ్చినవారు తొలగించడం లేదా?

నేటి యువత మీ వెనుక వస్తుందని అనుకుంటున్నారా?

విదార్థులు, యువతను సమస్యలతో కదిలించగలిగితే మాతోడు అవుతారని నమ్ముతున్నాం. అమరుల కుటుంబాలకు అండగా నిలవాలనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వారి ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకుని సమాజం సహకారంతో వారికి ఒక భరోసా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం.

గణపతి ఎక్కడున్నారు? షెల్టర్‌ జోన్‌కు తరలించారా?

ఆయన షెల్టర్‌ జోన్‌లో ఉన్నారా, అరణ్యంలో ఉన్నారా అనే విషయం చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. మా రాజకీయ పార్టీ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తే అప్పుడు గణపతి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం.

Updated Date - Mar 14 , 2026 | 05:51 AM