ప్రజల ప్రాణాలంటే చులకనా!
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:48 AM
పైన వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా.. కింద వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కార్మికులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వందల కిలోల బరువుండే బ్రేసింగ్......
ప్రమాదకరంగా సైదాబాద్ స్టీల్ వంతెన నిర్మాణ పనులు
కార్మికులకూ రక్షణ చర్యలు లేని వైనం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
హైదరాబాద్ సిటీ/సైదాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పైన వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా.. కింద వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కార్మికులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వందల కిలోల బరువుండే బ్రేసింగ్ (గర్డర్ల మధ్య ఏర్పాటుచేసే స్టీల్ కడ్డీ)ను వంతెనకు అమర్చుతున్నారు. వారికి ఎలాంటి రక్షణ కవచాలు కూడా లేవు. సంతోష్‌నగర్- సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వద్ద ఈ దుస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఇద్దరు కార్మికులు ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా రోడ్డుకు ఎనిమిది అడుగుల పైన గర్డర్ల మధ్య స్టీల్ బ్రేసింగ్‌లను అమర్చుతున్నారు. ఆ సమయంలో కింద రోడ్డుపై వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ప్రమాదవశాత్తు బ్రేసింగ్ పట్టు తప్పి కింద పడితే.. ఇక అంతే. రోడ్డుపై వెళ్తోన్న వాహనదారులకు ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉంటుంది. కార్మికులూ సేఫ్టీ బెల్డ్, తలకు హెల్మెట్, కాళ్లకు షూస్ వంటివి లేకుండా పని చేస్తున్నారు. అదుపు తప్పి స్టీల్ బీమ్ కిందపడినా.. కార్మికులు కింద పడినా.. వారితోపాటు దిగువన వాహనాలపై వెళ్తోన్న వారికీ ముప్పే. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నగర రోడ్లపై సాధారణంగా ట్రాఫిక్ మళ్లించి వంతెన నిర్మాణ పనులు చేపడతారు. కానీ, సైదాబాద్ వంతెన వద్ద మాత్రం పట్టపగలు.. వాహనాల రాకపోకలు మళ్లించకుండా ప్రమాదకరంగా పనులు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో సంబంధిత ఏజెన్సీ, అధికారులను ఉపేక్షించవద్దని నెటిజన్లు మండిపడుతున్నారు. పనుల సమయంలో తాత్కాలికంగా ట్రాఫిక్‌ను మళ్లించడం లేదా పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వ్మూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూ.620 కోట్లతో 2.58 కిలోమీటర్ల మేర స్టీల్ వంతెన పనులు మూడేళ్లుగా సాగుతున్నాయి. జూన్ వరకు వంతెన అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజా ఘటనపై అధికారులు స్పందించి భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.