Share News

బీఆర్‌ఎస్‌‌కు రాజీనామా చేయలేదు

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:30 AM

తాను బీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, తనను సస్పెండ్‌ చేసినట్లుగా ఆ పార్టీ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌..

బీఆర్‌ఎస్‌‌కు రాజీనామా చేయలేదు

  • ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్‌ చేయలేదు.. నేను కాంగ్రె్‌సలో చేరానని బీఆర్‌ఎస్‌ భావన

  • నాపై దాఖలైన అనర్హత పిటిషన్‌ చెల్లదు

  • స్పీకర్‌కు దానం నాగేందర్‌ అఫిడవిట్‌

  • 30న విచారణకు రావాలని స్పీకర్‌ నోటీసు

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): తాను బీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, తనను సస్పెండ్‌ చేసినట్లుగా ఆ పార్టీ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌.. స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు తెలిపారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్‌ నిర్వహించిన ఓ సమావేశానికి వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్లానని, మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లుగా బీఆర్‌ఎస్‌ భావిస్తోందన్నారు. ఈ మేరకు ఆదివారం స్పీకర్‌కు అఫిడవిట్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో లేవనెత్తిన అంశాల వారీగా అఫిడవిట్‌లో వివరణ ఇచ్చిన దానం నాగేందర్‌.. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం తనపై దాఖలైన పిటిషన్‌లో చూపిన ఏ కారణమూ చెల్లబోదన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అనర్హత పిటిషన్‌లోని అంశాలపైన మాత్రమే తాను వివరణ ఇస్తున్నానని, పిటిషన్‌ తర్వాతి పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దంటూ స్పీకర్‌ను కోరారు. దానం నాగేందర్‌ అఫిడవిట్‌ను పరిశీలించిన స్పీకర్‌ ఈ నెల 30న అనర్హత పిటిషన్‌పై విచారణకు రావాలని నోటీసులిచ్చారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై 30న స్పీకర్‌ విచారణ చేపడుతున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు కౌశిక్‌ రెడ్డి పిటిషన్‌, మధ్యాహ్నం 12 గంటలకు మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాదుల వాదనలను స్పీకర్‌ వింటారు.

సుప్రీం సూచనతో విచారణ వేగిరం..

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన దానం నాగేందర్‌, కడియం శ్రీహరి సహా పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు విడివిడిగా పిటిషన్లు వేశారు. సుప్రీం కోర్టు సూచన మేరకు విచారణ జరిపిన స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌.. అందులో ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై తీర్పు ఇచ్చారు. వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని ఆ పిటిషన్లను కొట్టివేశారు. మరో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన స్పీకర్‌.. నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే రెండు వారాల్లో ఈ పిటిషన్లను పరిష్కరించాలంటూ సుప్రీం కోర్టు ఇటీవల స్పీకర్‌కు సూచించడంతో.. వాటి విచారణపైనా ఆయన దృష్టి పెట్టారు. కడియం శ్రీహరి అఫిడవిట్‌ రూపంలో ఇప్పటికే వివరణ ఇచ్చారు.

Updated Date - Jan 29 , 2026 | 05:30 AM