సైబర్ నేరగాళ్ల వలలో సురవరం సుధాకర్ రెడ్డి సతీమణి
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:38 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట నకిలీ వీడియోతో దివంగత సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి భార్య విజయలక్ష్మి నుంచి సైబర్‌నేరగాళ్లు రూ.10.91 లక్షల మేర కాజేశారు...
కేంద్ర ఆర్థిక మంత్రి నకిలీ వీడియోతో మోసం
నమ్మి రూ.10.91 లక్షలు కోల్పోయిన వైనం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట నకిలీ వీడియోతో దివంగత సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి భార్య విజయలక్ష్మి నుంచి సైబర్‌నేరగాళ్లు రూ.10.91 లక్షల మేర కాజేశారు. ఖాజాగూడలో బీవీ విజయలక్ష్మి నివాసం ఉంటున్నారు. బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి ఆమె పదవీ విరమణ చేశారు. సోషల్ మీడియాలో నిర్మలా సీతారామన్ పేరిట వచ్చిన నకిలీ వీడియోను చూసిన ఆమె అది నిజమని న మ్మారు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత క్వాంటా పల్స్‌కు చెందిన ఆదిత్య సుబ్రమణియన్ గతేడాది డిసెంబరు26న ఆమెను సంప్రదించారు. తాము ట్రేడింగ్, ఇన్వె్‌స్టమెంట్ సేవలను అందిస్తామని చెప్పాడు. మొదట ప్రవేశ రుసుముగా ఆమె నుంచి రూ.13 వేలు వసూలు చేశారు. తర్వాత ప్రశాంత గౌడ(చీఫ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్), యూకేకు చెందిన వ్యక్తిగా చెప్పుకున్న అడమ్ స్మిత్‌లు పెట్టుబడులకు సంబంధించి ఆమెతో మాట్లాడారు. ఆ తర్వాత విడతల వారీగా మొత్తం రూ.10,91,328 వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు ఆమె బదిలీ చేశారు. ఆ తర్వాత తాను సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయానని గుర్తించి ఈనెల 23న గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.