ప్రతి ఇంటినీ లెక్కించాల్సిందే
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:40 AM
రాష్ట్రంలో చేపట్టే ‘ఇళ్ల గణన’లో ఏ ఒక్క ఇంటినీ వదిలిపెట్టకూడదని, ప్రతీ ఇంటిని లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.
గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లోని గృహాల లెక్కా రావాలి
జిల్లా కలెక్టర్లతో సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేపట్టే ‘ఇళ్ల గణన’లో ఏ ఒక్క ఇంటినీ వదిలిపెట్టకూడదని, ప్రతీ ఇంటిని లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశంలో భాగంగా మంగళవారం ఉదయం జన గణన, ఇళ్ల గణన అంశాలపై చర్చించారు. జన గణన, ఇళ్ల గణన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు, ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై సీఎ్‌సతో పాటు రాష్ట్ర జన గణన డైరెక్టర్ భారతి హొలికెరి ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మే 11 నుంచి ఇళ్ల గణన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఎస్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టనున్న 2027 జనగణన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇళ్ల గణనలో భాగంగా ఏ ఒక్క ఇంటిని, గ్రామాన్ని, మూరుమూల ప్రాంతాన్ని, గిరిజన అనుసంధాన గ్రామాన్ని, పట్టణ మురికివాడను వదిలిపెట్టకుండా లెక్కించాలని కలెక్టర్లను ఆదేశించారు. సిబ్బంది వెళ్లలేని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.