Share News

తమ్మినేనిపై అభిశంసన

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:49 AM

సీపీఎం సీనియర్‌ నేత తమ్మినేని వీరభద్రాన్ని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది. ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో తప్పుడు రాజకీయ దృక్పథాలను అనుసరించారని ఆక్షేపించింది.

తమ్మినేనిపై అభిశంసన

  • పార్టీ ప్రమాణాలను గాలికి వదిలేశారన్న కేంద్ర కమిటీ

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): సీపీఎం సీనియర్‌ నేత తమ్మినేని వీరభద్రాన్ని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది. ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో తప్పుడు రాజకీయ దృక్పథాలను అనుసరించారని ఆక్షేపించింది. 2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నిక సమయంలో ప్రజాతంత్ర చర్చ, ఏకాభిప్రాయ సాధన స్థానంలో లాబీయింగ్‌, ప్రలోభాలు, అస్తిత్వవాద అప్పీళ్లు చోటుచేసుకున్నాయని విమర్శించింది. పార్టీ ప్రమాణాలను గాలికి వదిలేశారని దుయ్యబట్టింది. ఆ ఎన్నికల సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ నిట్టనిలువునా చీలిందని పేర్కొంది. ‘‘నూతన రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక ప్రకియ్రలో ముఠాతత్వం ఆందోళనకర స్థాయికి చేరింది. పొలిట్‌బ్యూరో సభ్యులు ఐక్యతను నెలకొల్పడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఎన్నిసార్లు అప్పీల్‌ చేసినా అప్పటి రాష్ట్ర కార్యాదర్శి తమ్మినేనితో సహా పార్టీ నాయకత్వంలోని ఒకవర్గం వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదు. ఫలితంగా పార్టీ ఐక్యత నిలబెట్టేందుకు పొలిట్‌బ్యూరో సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలో అనేక అభ్యంతరకర, అంగీకరించలేని ధోరణులు తీవ్రరూపంలో కనిపించాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో చాలా మంది సభ్యులు సదరు లాబీయింగ్‌, గుసగుసలు, తెరవెనుక జరిగిన మంత్రాంగం, ప్రచారం పట్ల తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేశారు. అలాంటి ప్రవర్తనలకు సీనియర్‌ నాయకులే పాల్పడడం మునుపెన్నడూ ఎన్నడూ జరగలేదు. ఇది పార్టీ సంప్రదాయాలకు, రాజకీయ సంస్కృతికి పూర్తి విరుద్ధమైనది’’ అని కేంద్రకమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఒక భాగం.. పార్టీ సమిష్టి ప్రయోజనాలు, సూత్రాలకన్న మిన్నగా వ్యక్తిగత ఆకాంక్షలతో వ్యవహరిస్తున్నారని పేర్కొంది. వీటన్నింటిపై గతంలోనే తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్‌బాబు, ప్రసాద్‌ల వివరణను కేంద్రకమిటీ కోరింది. వారి వివరణలను పరిశీలించి.. వాటిపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వారిచ్చిన వివరణలు అసమగ్రంగా ఉన్నాయని, వాటిలో ఆత్మవిమర్శ లోపించిందని పేర్కొంటూ ముగ్గురినీ అభిశంసించింది.


వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వీరభద్రాన్ని రాష్ట్ర సెక్రటేరియట్‌ కమిటీ సమావేశాల్లో పరిశీలకులుగా ఉండాలని, రాష్ట్ర సెక్రటేరియట్‌ మార్గదర్శకత్వంలో నడుచుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీకి కేంద్రకమిటీ 4 పేజీల సుదీర్ఘ లేఖ రాసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగినసీపీఎం కీలక భేటీలో దీనిపై చర్చించారు. కేంద్రకమిటీ లేఖను శాఖా కార్యదర్శుల వరకూ పంపాలని నిర్ణయించారు. పార్టీ నిర్మాణంలో కొనసాగుతున్న అనారోగ్యకర వాతావరణాన్ని కేంద్రకమిటీ ఇదివరకే గుర్తించింది. ఈ సమస్యలపై రాష్ట్ర సెక్రటేరియట్‌, రాష్ట్ర కమిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ బేబి, పొలిట్‌ బ్యూరో సభ్యులు విజయరాఘవన్‌, శ్రీదీప్‌ భట్టాచార్య, బి.వి.రాఘవులును పార్టీ నియమించింది. వారి నివేదిక ఆధారంగా దీనిపై దర్యాప్తు చేసేందుకు 2025 ఆగస్టు 18న పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీదీప్‌ భట్టాచార్య, కె.బాలకృష్ణన్‌లతో ఒక ద్విసభ్య కమిషన్‌ను పంపించింది. కమిషన్‌ నివేదిక ఆధారంగా తమ్మినేని వీరభద్రం, స్కైలాబ్‌బాబు, ప్రసాద్‌ను అభిశంసించామని పేర్కొంది.

తప్పుడు దృక్పథం..

‘‘రాష్ట్ర కార్యదర్శి తన బాధ్యతలను స్వతంత్రంగా, సమర్థంగా నిర్వర్తించాలి. రాష్ట్ర కమిటీలో సమిష్టి పనివిధానాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత ఆయనదే. అందుబాటులో ఉన్న సెక్రటేరియట్‌ సభ్యులతో రోజువారీ సమావేశాలు నిర్వహించాలి. నిర్ణయాలను సమిష్టిగా మాత్రమే తీసుకోవాలి. రాష్ట్రంలోని పార్టీ సభ్యులందరూ పార్టీ లైన్‌ ప్రకారం పనిచేయాలి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితి దృష్ట్యా ఒక ముఖ్యమైన, తీవ్రమైన దిద్దుబాటు క్రమాన్ని పార్టీ నాయకత్వం చేపట్టాలి. ఇదంతా పొలిట్‌బ్యూరో మార్గదర్శకత్వంలో జరగాలి’’ అని లేఖలో పేర్కొంది.

ఇండియా ఫస్ట్‌ అని మోదీ అనరేం?

  • సీపీఎం విస్తృత స్థాయి సమావేశంలో నేతలు

అమెరికా ఫస్ట్‌ అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నట్లుగా.. ఇండియా ఫస్ట్‌ అని భారత ప్రధాని ఎందుకు చెప్పడం లేదని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.అరుణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి మోదీ సాగిలపడుతున్నారని విమర్శించారు. సీపీఎం విస్తృత స్థాయి సమావేశం సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లి.. ఆ దేశ ప్రధాని నెతన్యాహు మంచి పనులు చేస్తున్నారని ప్రశంసించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 03 , 2026 | 03:49 AM