కాంగ్రెస్ ఖాతాలో 10 వార్డులు
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:41 AM
మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఐదు జిల్లాల్లోని పలు మునిసిపాలిటీల్లో కలిపి 10 మంది వార్డు సభ్యులు ఆ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
5 జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు.. కోదాడలో ఏకగ్రీవం అయినందుకు ప్రజల నిరసన
ఎన్నిక జరిగితే ఓటుకు రూ.2 నుంచి 3వేలు పంచేవారంటూ రాస్తారోకో
బీఆర్‌ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారన్న మాజీ ఎమ్మెల్యే
పోలీసులకు ఫిర్యాదు.. తరువాత వెనక్కి
యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ఏకగ్రీవం
చౌటుప్పల్‌లో 2 పార్టీల తరఫున ఒక్కరే!
తమ్మినేని స్వస్థలంలో కాంగ్రెస్ ఏకగ్రీవం
వికారాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం
ఆ వెంటనే స్పీకర్ సమక్షంలో కాంగ్రె్‌సలోకి..
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఐదు జిల్లాల్లోని పలు మునిసిపాలిటీల్లో కలిపి 10 మంది వార్డు సభ్యులు ఆ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడ మునిసిపాలిటీలో మూడు వార్డులు, హుజూర్‌నగర్‌లో ఒకటి, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, వికారాబాద్ మునిసిపాలిటీల్లో రెండు చొప్పున, నల్లగొండ జిల్లా హాలియా, ఖమ్మం జిల్లా ఏదులాపురంలో ఒక్కొక్క వార్డు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన ఆయా ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. యాదగిరిగుట్ట మునిసిపాలిటీలోని 10వ వార్డుకు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్న ఆవుల మమతసాయి.. మంగళవారం చివరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణీ భరత్‌గౌడ్ ఏకగ్రీవమయ్యారు. అయితే తమ అభ్యర్థిని డబ్బుతో ప్రలోభపెట్టి ఉపసంహరింపజేశారని డీసీసీబీ మాజీ చెర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలో నిరసన ప్రదర్శన, కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా, చౌటుప్పల్ మునిసిపాలిటీలో 17వ వార్డు అభ్యర్థిగా చింతల ఉమామహేశ్వరి రెండు సెట్ల నామినేషన్ వేసి.. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్ రెండు పార్టీల నుంచీ బీ-ఫారాలు తీసుకున్నారు. చివరికి కాంగ్రెస్ బీ-ఫారాన్ని సమర్పించడంతోపాటు మరో అభ్యర్థిని ఉపసంహరింపజేసి ఏకగ్రీవమయ్యారు. దీంతో తమ బీ-ఫారంతో వెళ్లి పార్టీని మోసం చేసిందంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు చేపట్టారు.
సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వస్థలమైన ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో పరిధిలోని తెల్దారుపల్లిలో ఓ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ 15వ వార్డులో సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి, కాంగ్రెస్ తరఫున దివంగత నాయకుడు తమ్మినేని కృష్ణయ్య సతీమణి మంగతాయి నామినేషన్ వేశారు. తమ్మినేని కృష్ణయ్య 2022 ఆగస్టు 15న హత్యకు గురికాగా.. ఆ కేసులో తమ్మినేని కోటేశ్వరరావు కూడా నిందితుడిగా ఉన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఇరు కుటుంబాల నుంచి బరిలో దిగడంతో గ్రామంలో మళ్లీ రాజకీయ ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని గ్రహించిన కొందరు పెద్దలు.. మధ్యవర్తిత్వం చేయడంతో సీపీఎం అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
‘ఏకగ్రీవం చేసుకుని.. మా నోట్లో మట్టి కొట్టారు’
సూర్యాపేట జిల్లా కోదాడ మునిసిపాలిటీలో 11వ వార్డు ఏకగ్రీవం కావడం ఆ వార్డు ప్రజలకు నచ్చలేదు. ‘‘ఏకగ్రీవం అయితే మాకేంటి? ఏకగ్రీవం చేసుకుని మా నోట్లో మట్టి కొట్టారు. ఎన్నిక జరిగితే ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు పంచేవారు’’ అంటూ గంటసేపు రాస్తారోకో చేశారు. 11వ వార్డు నుంచి ఆఖరు నిమిషంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి డి.గీతాసత్యప్రసాద్ విత్‌డ్రా చేసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. విషయం తెలుసుకున్న వార్డు ప్రజలు.. నాయకులు అమ్ముడుపోయారని, ఏకగ్రీవం చేసుకుని తమ నోట్లో మట్టి కొట్టారంటూ రాస్తారోకో నిర్వహించారు. అయితే ఓటమి భయంతోనే తమ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి నామినేషన్ విత్‌డ్రా చేయించారంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బస్‌స్టేషన్ వద్ద ఎదుట ధర్నా చేపట్టారు. అయితే బీఆర్‌ఎస్ అభ్యర్థి గీతాసత్యప్రసాద్ దంపతుల కిడ్నాప్ జరిగిందనేది అవాస్తవమని ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి అన్నారు. వారు ఇంటికి చేరుకోవడంతో మల్లయ్యయాదవ్ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని తెలిపారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏకగ్రీవం.. కాంగ్రె్‌సలో చేరిక
వికారాబాద్ మునిసిపాలిటీలో 34 వార్డులు ఉండగా.. 15వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్ సతీమణి విజయలక్ష్మి నామినేషన్ వేశారు. ఆమెపై కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన శేషగిరి మంగళవారం తన నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆ వెంటనే విజయలక్ష్మి దంపతులు స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. అంతకుముందు 1వ వార్డుకు చెందిన బీఆర్‌ఎస్ అభ్యర్థి తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు మునిసిపల్ కార్యాలయానికి పరుగులు తీశారు. దీనిని గమనించిన బీఆర్‌ఎస్ నాయకులు ఆయనను ఆపేందుకు ప్రయత్నించినా.. వారిని తప్పించుకుని వెళ్లి విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మునిసిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. తమ అభ్యర్థులను విత్‌డ్రా చేయించడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేశారని ఆరోపించారు.
‘నాకు బీ-ఫాం వద్దు.. నా దోస్తుకే ఇవ్వండి’
కేసముద్రం: రాజకీయాల్లో తన, పర బేధం ఉండదని, సాటివారిని తొక్కుకుంటూ అయినా పదవులు పొందాలనుకుంటారన్నది ప్రచారం. కానీ, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మునిసిపాలిటీలోని మాత్రం ఇద్దరు స్నేహితులు.. స్నేహం కోసం తానంటే తాను పోటీ నుంచి తప్పుకొంటానంటూ ముందుకొచ్చారు. ఓ వార్డులో వీరిద్దరూ ఒకే పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇద్దరిలో ఒకరికి బీ-ఫారం ఇచ్చేందుకు పార్టీ నిర్ణయించడంతో.. తనకు దక్కలేదని మరో అభ్యర్థి బాధపడుతున్నాడు. దీంతో ‘నాకు ఇస్తామన్న బీఫారాన్ని నా దోస్తుకు ఇవ్వండి’ అంటూ పార్టీ అధిష్ఠానానికి సూచించాడు. అయితే ఇందుకు రెండో అభ్యర్థి నిరాకరించి.. తన స్నేహితుడికే ఇవ్వాలని అధిష్ఠానంతో చెప్పి ఇప్పించాడు.