Share News

నేడు రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

ABN , Publish Date - Mar 04 , 2026 | 02:41 AM

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఏఐసీసీ బుధవారం ప్రకటిస్తుందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

నేడు రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

  • 16 మంది ఆశావహుల పేర్లను రాహుల్‌కు ఇచ్చాం.. వారిలో నలుగురు సమర్థులైన బీసీ నేతలున్నారు

  • లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తాం

  • రాజకీయాల కోసమే కేరళ సీఎం వ్యాఖ్యలు

  • చిట్‌చాట్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, మార్చి 93 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఏఐసీసీ బుధవారం ప్రకటిస్తుందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ అంశంపై సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో రాహుల్‌గాంధీతో తాను, సీఎం రేవంత్‌రెడ్డి అరగంట పాటు చర్చించామన్నారు. సామాజిక వర్గాల వారీగా 16 మంది ఆశావహుల పేర్లతో కూడిన జాబితాను ఆయనకు ఇచ్చామని తెలిపారు. బీసీల నుంచి నలుగురు సమర్థులైన నాయకులు రాజ్యసభ అవకాశం కోరుతున్నారని, అయితే రాష్ట్రం కోటాలో ఒక్కరికే ఇస్తారా? లేక ఇద్దరికి అవకాశం కల్పిస్తారా? అన్నది బుధవారం తేలుతుందని చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో మహేశ్‌గౌడ్‌ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ కార్పొరేట్‌ వ్యక్తులకు రాజ్యసభ అవకాశం కల్పించింది తప్ప.. తెలంగాణ ఏర్పాటు కోసం పనిచేసిన ఒక్కరికైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి రాజ్యసభ సీటు అడగడంలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కార్పొరేషన్‌ పదవులపై కసరత్తు జరుగుతోందని, ఈ నెలలో కొన్ని కార్పొరేషన్‌ పదవులు ఇస్తామన్నారు. కాగా, ఏపీ, తెలంగాణకు చెందిన డీసీసీ అధ్యక్షులకు పది రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి 8 మంది.. రెండు, అంతకంటే ఎక్కువ రోజులు గైర్హాజరయ్యారని తెలిపారు. వారు గైర్హాజరైనన్ని రోజులు సేవాగ్రామ్‌లో శిక్షణ తీసుకు న్న తర్వాతే వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామన్నారు. రాష్ట్రంలో 8 చోట్ల పార్టీ ఎమ్మెల్యేలు తమకు సహకరించడం లేదంటూ డీసీసీ అధ్యక్షులు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేశారని మహేశ్‌గౌడ్‌ తెలిపారు. ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిందిగా ఆయన తనకు సూచించారని, ఆ ఎమ్మెల్యేలతో తాను వెంటనే మాట్లాడానని చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు తలో రూపాయి వేసుకుంటే రూ.వెయ్యి కోట్లు అవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడితే.. బీఆర్‌ఎస్‌ నేతలు దానిని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ పేరుతో తనకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలకు తానే ఎన్నికల ఖర్చు భరిస్తానని ప్రకటించారని, అంత డబ్బు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన పట్ల కేరళ సీఎం పినరయి విజయన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రాజకీయాల కోసమే ఆయన అలా మాట్లాడారని, దానికి మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్‌ లోకి వస్తామంటే తాము ఆహ్వానిస్తామని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం వారు దశాబ్దాలపాటు పో రాటం చేశారన్నారు. మావోయిస్టు సిద్ధాంతం పట్ల తమకు భిన్నాభిప్రాయం ఉన్నా.. ప్రజల కోసం పోరాడినందున వారిపై గౌరవం ఉంటుందని చెప్పారు.


రాహుల్‌ సేవలు అవసరం: మల్లు రవి

ప్రస్తుతం దేశానికి రాహుల్‌గాంధీ సేవలు చాలా అవసరమని ఎంపీ మల్లు రవి అన్నారు. దేశానికి ప్రధాని కావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనకు రాహుల్‌ అంగీకరించడం హర్షణీయమన్నారు. ఈ ప్రతిపాదన చేసినందుకు తెలంగాణ ఎంపీల ఫోరం తరఫున సీఎంకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానఇ గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌, మహేశ్‌గౌడ్‌

రాజ్యసభ అభ్యర్థుల విషయంపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్న సీఎం.. సాయంత్రం అధిష్ఠానం పెద్దలతో భేటీ కానున్నారు. సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో 16 మందితో కూడిన ఆశావహుల జాబితాను రాహుల్‌కు సమర్పించగా.. బుధవారం ఢిల్లీలో సమావేశమై నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం కబురు పెట్టడంతో.. ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. సీఎంతోపాటు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ కూడా వెళుతున్నారు. తెలంగాణకు సంబంధించి రెండు సీట్లలో ఒకటి ఇప్పటికే అభిషేక్‌ సింఘ్వీకి ఖరారు కాగా, రెండో సీటుకు తీవ్రంగా పోటీ ఉంది. అగ్రకులాల కోటాలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచద్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చిన్నారెడ్డి, హర్కార వేణుగోపాల్‌ పేర్లు చర్చల్లో ఉన్నాయి. బీసీ కోటాలో సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, డాక్టర్‌ వినయ్‌కుమార్‌ పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి.

Updated Date - Mar 04 , 2026 | 02:41 AM