మంత్రి పొన్నం బావమరిదికి నిరాశ
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:40 AM
జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్ కుమార్ గౌడ్‌కు నిరాశ ఎదురైంది.
జనగామ మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఆశించి భంగపడ్డ నవీన్‌కుమార్ గౌడ్
మరొకరికి ఆ వార్డు కాంగ్రెస్ టికెట్
జనగామ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్ కుమార్ గౌడ్‌కు నిరాశ ఎదురైంది. 6వ వార్డు నుంచి పోటీ చేయాలని ఆయన భావించి, టికెట్ కోసం ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 30 వార్డులు ఉండగా పొత్తులో భాగంగా సీపీఎంకు 3, సీపీఐకి ఒకటి కేటాయించారు. 21 వార్డులకు శనివారమే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 5 వార్డులకు అభ్యర్థులను సోమవారం ఖరారు చేశారు. ఆ జాబితాలో తన పేరు లేకపోవడంతో నవీన్‌కుమార్ నిరాశచెందారు. మంత్రి పొన్నం భార్యకు నవీన్ స్వయానా తమ్ముడు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జనగామ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా, రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకుడిగా సుపరిచితుడైన హనుమకొండకు చెందిన వెంకటనారాయణ గౌడ్ కుమారుడే నవీన్. జనగామతో ఉన్న అనుబంధం కారణంగా వెంకటనారాయణ తన కుమారుడిని కౌన్సిలర్‌గా గెలిపించుకొని చైర్మన్‌ను చేయాలని ఆశించారు. కాగా.. నవీన్ స్థానికేతరుడంటూ టికెట్ ఆశించిన వార్డు నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయ సేకరణ చేపట్టి సంతకాలు చేశారు. ఈ లేఖను ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డికి, ఎంపిక కమిటీకి పంపించారు. ఇదే క్రమంలో 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా బుక్క బాల భరద్వాజ్‌ను ఎంపిక చేశారు. ఆయన గతంలో రెండు పర్యాయాలు నామినేషన్ దాఖలు చేసి... పార్టీ విజ్ఞప్తి మేరకు ఉపసంహరించుకున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని కమిటీ భావించినట్లు తెలుస్తోంది. నవీన్ స్థానికేతరుడు కావడం, వార్డులో బలాబలాలను పరిగణనలోకి తీసుకొని కమిటీ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. నవీన్‌కు టికెట్ ఇప్పించేందుకు మంత్రి పొన్నం, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఎంపీ చామల ప్రయత్నించినా.. రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీలో దిగాలన్న ఆలోచనలో నవీన్ ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే వేరే పార్టీ నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై వెంకట నారాయణ గౌడ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఆయన ధ్రువీకరించారు.