ఖాతా తెరిచిన కాంగ్రెస్
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:35 AM
మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. మెదక్ మున్సిపాలిటీ 32వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది...
మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవం
బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ
మెదక్, కోల్‌సిటీ, మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. మెదక్ మున్సిపాలిటీ 32వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున గోదల మానస, లక్ష్మి, బీఆర్‌ఎస్ నుంచి జ్యోతి నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవలే బీఆర్‌ఎ్‌సలో చేరిన జ్యోతికి బీఆర్‌ఎస్ బీఫాం ఇచ్చినా నామినేషన్ ఉపసంహరించుకుని కాంగ్రెస్ అభ్యర్థి మానసకు మద్దతు ప్రకటించారు. మానస అత్త(భర్త తల్లి) లక్ష్మి కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఒకరే బరిలో నిలవడంతో ఆమె ఏకగ్రీవం కానున్నారు.
రామగుండం కార్పొరేషన్‌లో ఖాతా తెరిచిన కాంగ్రెస్
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఒకటో డివిజన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డివిజన్‌లో ముగ్గురు నామినేషన్ వేయగా ఇద్దరు ఉప సంహరించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ, బీఆర్‌ఎస్ నుంచి విజ్జగిరి శ్వేత, బీజేపీ నుంచి రీమా బిశ్వాస్ నామినేషన్లు వేశారు. ఐతే బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తన భర్త పంకజ్‌కుమార్‌ను ఎన్‌టీపీసీ ప్లాంట్‌లో విధుల్లో ఉండగా పోలీసులు పిలిపించి గంజాయి కేసు పెడతామని బెదిరించడంతో నామినేషన్ ఉపసంహరించుకున్నానని బీజేపీ అభ్యర్థి రీమా బిశ్వాస్ ఆరోపించారు. దీనిపై అదనపు డీసీపీ శ్రీనివా్‌సకు ఫిర్యాదు చేసి కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పాలమూరు కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బోణీ
పాలమూరు కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బోణీ కొట్టింది. 58వ డివిజన్(రాజేంద్రనగర్) నుంచి రమాదేవి కాంగ్రెస్ తరపున నామినేషన్ వేశారు. బరిలో నిలిచిన బీజేపీ అఽభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.