నిజాం స్ఫూర్తితో మూసీ పునరుజ్జీవం
ABN , Publish Date - Mar 13 , 2026 | 05:00 AM
హైదరాబాద్ మధ్య నుంచి ప్రవహిస్తూ కాలుష్యమయంగా మారిన మూసీనదిని పునరుజ్జీవింపజేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం..
నేడుమూసీ ప్రాజెక్టు ప్రణాళికను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
హైదరాబాద్ సిటీ, మార్చి12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మధ్య నుంచి ప్రవహిస్తూ కాలుష్యమయంగా మారిన మూసీనదిని పునరుజ్జీవింపజేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. పూర్వకాలంలో నిజాం పాలకులు అనుసరించిన విధానాలతోపాటు ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన నదీ పునరుజ్జీవ ప్రాజెక్టుల్లోని ఉత్తమ విధానాలను ఇందుకోసం స్వీకరించనుంది. ప్రస్తుతం హైకోర్టు ఉన్న ప్రాంతంలో నిజాం పాలకులు మూసీకి ఇరువైపులా ప్రహరీ నిర్మించారు. నదికి ఒకవైపు ఉస్మానియా ఆస్పత్రి.. మరోవైపు హైకోర్టు భవనం, ఇరువైపులా రోడ్డు, రోడ్డుకు దిగువన పచ్చదనం ఉండేలా ఏర్పాట్లు చేశారు. అదే తరహాలో ఇప్పుడు నదిని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు’ ప్రణాళికను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించనున్నారు.
మురుగే సమస్య
నగరంలో దాదాపు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీనదిలో పెద్దఎత్తున మురుగు చేరుతోంది. దాదాపు 160 ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీ లైన్ల ద్వారా మురుగు కలుస్తోంది. నదిలోకి ఈ మురుగు చేరకుండా చర్యలు చేపట్టడంతోపాటు ఇప్పటికే చేరిన మురుగును తొలగించాల్సి ఉంది. ఇందుకోసం నదికి ఇరువైపులా ట్రంక్‌లైన్ల నిర్మాణానికి వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో దాదాపు రూ.4,700 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. మురుగును శుద్ధి చేయడానికి వివిధ ప్రాంతాల్లో మరిన్ని సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి వాటర్‌బోర్డు చర్యలు చేపట్టింది. మూసీలో గోదావరి జలాలను ప్రవహింపజేసే పనులు కూడా వాటర్‌బోర్డు నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి మూసీనదిలో గోదావరి జలాలు ప్రవహింపజేసేలా పనులు జరుగుతున్నాయి. దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఉన్న జుంగ్‌నాంగ్ నది తరహాలోనే మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గుజరాత్‌లోని సబర్మతి నది పునరుజ్జ్జీవానికి అనుసరించిన విధానాల్లో ఉత్తమమైన వాటిని స్వీకరించనుంది. దేశంలో ఏ ప్రాంతంలోనూ నైట్ ఎకానమీ లేదు. రాత్రి 12 గంటలు దాటితే వాణిజ్య సముదాయాలన్నీ మూసేయాల్సి ఉంటుంది. కానీ పగలు, రాత్రి తేడా లేకుండా 24గంటలూ నైట్ ఎకానమీ ఉండేలా మూసీ పునరుజ్జీవ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రాజెక్టు ఫేజ్-1లో భాగంగా వచ్చే గాంధీ సరోవర్ ప్రాజెక్టును హైదరాబాద్‌కు ఒక ఐకాన్‌గా ఉండేలా నిర్మించనున్నారు. 100మీటర్ల టవర్, దానిపై గాంధీవిగ్రహం.. మ్యూజియం, విజ్ఞాన కేంద్రం ఉండేలా డిజైన్ చేశారు.
20 వంతెనలు.. దేనికదే ప్రత్యేకం
మొదటి దశలో ఈసీ నది వెంట హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, మూసీనది వెంట గండిపేట నుంచి బాపూఘాట్ వరకు దాదాపు 21 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. నదిపై 20 ప్రాంతాల్లో కొత్తగా వంతెనలు నిర్మిస్తారు. మొదటి దశలో నాలుగు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో బ్రిడ్జి ఒక్కో రకమైన థీమ్‌తో ఉంటుంది. వీటి కింది భాగంలో చిన్నపాటి డ్యామ్‌లు నిర్మించి, స్వచ్ఛమైన గోదావరి జలాలను నిల్వచేస్తారు. అందులో బోటింగ్ సౌకర్యం ఉంటుంది. ఇలాంటి సౌకర్యం మొదటిసారి హైదరాబాద్‌లోనే అందుబాటులోకి రానుంది.