ఇరాన్, గల్ఫ్ ప్రాంతాల్లోని.. తెలుగు వాళ్లు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:23 AM
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న నేపథ్యంలో ఇరాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ...
ఆ దేశాల్లోని భారత ఎంబసీకాన్సులేట్‌లతో సంప్రదింపులు జరపాలి
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న నేపథ్యంలో ఇరాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్టు వస్తున్నట్టు వస్తున్న వార్తల దృష్ట్యా భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నదని పేర్కొన్నారు. ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్ధితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నదని తెలిపారు. ఆయా దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు, కాన్సులేట్‌లతోనూ సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారని ఆయన కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మహేశ్ గౌడ్
గల్ఫ్‌దేశాల్లో నివసిస్తున్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ సూచించారు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.