సీఎం రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:17 AM
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో...
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి
సీఎస్, సీఎంవో అధికారులతో సీఎం భేటీ
హైదరాబాద్/శంషాబాద్ రూరల్/మిర్యాలగూడ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు ఘన స్వాగతం పలికారు. దావోస్ పర్యటనను ముగించుకుని సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు ఎయిర్‌పోర్టు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్, కలెక్టర్ నారాయణరెడ్డి పుష్పగుచ్చాలు అందజేశారు. వీవీఐపీ గేట్ వద్ద వేచి ఉన్న నాయకులు, కార్యకర్తలను సీఎం ఆప్యాయంగా పలకరించారు. హైదరాబాద్ రాగానే పాలనపై దృష్టి పెట్టిన సీఎం.. తన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులతో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏ మేరకు నిధులు రానున్నాయి? ఏయే కేటాయింపులు రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉన్నాయి? ఏయే అంశాలు నష్టం కలిగిస్తున్నాయి? అనే అంశాలపై ఆరా తీశారు. కాగా, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయుడిని అభినందించిన సీఎం.. ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మిర్యాలగూడ రానున్నారు. మిర్యాలగూడ శివారులోని గూడూరు సమీపంలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు.