Share News

సీఎం రేవంత్‌కు హార్వర్డ్‌ పట్టా

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:26 AM

సర్కారు బడిలో చదివి.. రాజకీయాల్లోకి వచ్చి.. తక్కువ సమయంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మరో రికార్డు సాధించారు.

సీఎం రేవంత్‌కు హార్వర్డ్‌ పట్టా

  • కెనడీ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్న ముఖ్యమంత్రి

  • సీఎం హోదాలో హార్వర్డ్‌ సర్టిఫికెట్‌ పొందిన తొలివ్యక్తిగా రికార్డు

హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): సర్కారు బడిలో చదివి.. రాజకీయాల్లోకి వచ్చి.. తక్కువ సమయంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మరో రికార్డు సాధించారు. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలోని కెనెడీ స్కూల్‌లో ‘21వ శతాబ్దంలో నాయకత్వం’ కోర్సును పూర్తిచేసి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఓ రాష్ట్ర సీఎం హోదాలో కోర్సును పూర్తిచేసి.. హార్వర్డ్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కారు. హార్వర్డ్‌ వర్సిటీలో ఈ కోర్సుకు సంబంధించి ఈ నెల 25 నుంచి వారంపాటు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు నిర్వహించారు. 20 దేశాలకు చెందిన 60 మంది విద్యార్థులు ఈ క్లాసులకు హాజరయ్యారు. సీఎం రేవంత్‌ కూడా తరగతులకు హాజరై.. హోంవర్కులు, అసైన్‌మెంట్లు పూర్తిచేశారు. కొన్ని కేస్‌ స్టడీలను పూర్తిచేసి ప్రొఫెసర్లకు సమర్పించారు. అధికారం, నాయకత్వం, అనిశ్చితి వంటి అంశాలపై శిక్షణ పూర్తిచేశారు. సర్టిఫికెట్‌ ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం కోర్సులో పాల్గొన్నవారితో కలిసి రేవంత్‌ గ్రూపు ఫొటో దిగారు. ఇందుకు సంబంధించి తన అనుభూతిని ‘ఎక్స్‌’లో వివరించారు. ‘‘ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్‌ కెనెడీ స్కూల్‌లో నా ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ ‘21వ శతాబ్దంలో నాయకత్వం’ కోర్సును పూర్తిచేశాను. ఈ కోర్సులో నాతోపాటు 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది పాల్గొన్నారు. క్లాసుల సమయంలో అత్యున్నత విజయాలు సాధించిన వ్యక్తులు, అధ్యాపకులను విద్యార్థుల రూపంలో కలుసుకున్నాను. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇది చాలా ఆనందం కలిగించింది. ఇక నా కోర్సు మొత్తం మంచు తుఫాను నేపథ్యంలోనే నడిచింది. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండడం, చలిగాలుల మధ్యనే క్లాసులు జరిగాయి’’ అని రేవంత్‌ పోస్టు చేశారు. ఈ సందర్భంగా మారుమూల గ్రామంలోని సర్కారు బడి నుంచి హార్వర్డ్‌ వర్సిటీ వరకు రేవంత్‌ ప్రయాణం జరిగిందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - Jan 31 , 2026 | 04:26 AM