Share News

మూసీ బాధితులకు ఉచిత ఇళ్లు

ABN , Publish Date - Mar 09 , 2026 | 03:56 AM

విదేశాల తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలో నదికి ఇరువైపులా ఇళ్లు కోల్పోయే వారికి సమీపంలోనే ప్రభుత్వ ఖర్చులతో.....

మూసీ బాధితులకు ఉచిత ఇళ్లు

  • ప్రభుత్వ ఖర్చులతోనే నిర్మించి ఇస్తాం: సీఎం.. బుమ్‌-రుక్న్‌-ఉద్దౌలా చెరువు ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): విదేశాల తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలో నదికి ఇరువైపులా ఇళ్లు కోల్పోయే వారికి సమీపంలోనే ప్రభుత్వ ఖర్చులతో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. నగర అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, క్షేత్రస్థాయిలో ఇబ్బందుల్లేకుండా సహకరిస్తూ పనులు చేయించుకునే బాధ్యత ప్రజలదేనని పేర్కొన్నారు. శివరాంపల్లిలో హైడ్రా అభివృద్ధి చేసిన బుమ్‌-రుక్న్‌-ఉద్దౌలా చెరువును ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఇతర నాయకులతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. శతాబ్దాల చరిత్ర, ప్రాభవం కోల్పోతున్న హైదరాబాద్‌ను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోందన్నారు. నిజాం హయాంలో గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేశారని, ఉస్మానియా ఆస్పత్రి, యూనివర్సిటీ వంటి సదుపాయాలు కల్పించారని, తాగు, సాగునీటి సౌకర్యాల కోసం మూసీ, ఈసా నదులు నిర్మించారని పేర్కొన్నారు. నిజాం నిర్మించిన భవనంలోనే ఈ రోజు శాసనమండలిని ప్రారంభించుకున్నామని చెప్పారు. చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలు తొలగించి వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. దేశంలోనే నంబర్‌వన్‌ సిటీగా ఉండే హైదరాబాద్‌.. కాలగమనంలో అధ్వానంగా మారిందని, ఎక్కడికి వెళ్లినా చెత్తాచెదారం కనిపిస్తోందని ఆవేద న వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని మార్చేందుకు ప్రభు త్వం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను ప్రారంభించిందన్నారు.


ఇది ఒరిజినల్‌ సిటీ..

ఓవైపు చార్మినార్‌, మరోవైపు గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలున్న ఈ ప్రాంతం ఓల్డ్‌సిటీ కాదని, ఒరిజినల్‌ సిటీ అని సీఎం రేవంత్‌ అన్నారు. మూడు నెలల్లో నగరంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు తెలిపారు. రోడ్ల విస్తరణ, వంతెనలు, మెట్రో రైల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. మీరాలం మండి, జూపార్కు, పీవీఎన్‌ఆర్‌, శంషాబాద్‌ వైపు వంతెన నిర్మిస్తున్నట్టు చెప్పారు. గోషామహల్‌లో నూతనంగా ఉస్మానియా ఆస్పత్రి నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఆస్పత్రి ఉన్న భవనాన్ని చారిత్రక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పురాతన బతుకమ్మ కుంటను పునరుద్ధరించామని, బుమ్‌- రుక్న్‌-ఉద్దౌలా ఏడాది క్రితం ఎలా ఉండేదో, ఇప్పుడెలా ఉందో చూడాలన్నారు. లేక్‌ ఎకానమీ అభివృద్ధి చెందేలా మహిళా స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తులు, ఇతర వ్యాపారాలు చేసుకునేలా స్టాళ్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. మహిళలు, చిన్నారులకు చెరువు వద్ద ఇబ్బంది కలగకుండా లేక్‌ పోలీసింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పోలీస్‌, మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. పాతబస్తీలో ఇబ్బంది లేకుండా పనులు జరిగేలా అసదుద్దీన్‌ పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అంతకుముందు ఇందిరా మహిళా శక్తి స్టాళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 03:56 AM