పోస్టింగులు ఎలా వస్తున్నాయో చూస్తున్నారుగా..
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:29 AM
ఈ రెండేళ్లలో 90 శాతం అధికారులకు పోస్టింగులు ఎలా వస్తున్నాయో టీవీల్లో చూసి ఉంటారు. అధికారులను ఏ, బీ, సీ కేటగిరీలుగా మార్చుకొని పెట్టుకున్నా....
అధికారులను ఏ, బీ, సీ క్యాటగిరీలుగా పెట్టుకున్నా.. దానికి అనుగుణంగానే పోస్టింగులు ఇస్తున్నాను
పోలీసు అధికారుల రిట్రీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ‘ఈ రెండేళ్లలో 90 శాతం అధికారులకు పోస్టింగులు ఎలా వస్తున్నాయో టీవీల్లో చూసి ఉంటారు. అధికారులను ఏ, బీ, సీ కేటగిరీలుగా మార్చుకొని పెట్టుకున్నా. దానికి అనుగుణంగానే వారికి పోస్టింగ్స్ ఇస్తున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను రైట్ కావచ్చని, రాంగ్ కావచ్చని అంటూనే.. మీరంతా డేటా పెట్టుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. టార్గెట్ పెట్టుకోకుండా ఏ పరీక్ష రాసినా.. ఉత్తమ ఫలితాలు సాధించలేరన్నా రు. తెలంగాణ పోలీసు అకాడమీలో సోమవారం జరిగిన ‘తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. కింది స్థాయి ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకోవాలని, వారితో ఉన్నతాధికారులు కనెక్ట్ కావాలని, అప్పుడే సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పారు. పోలీసింగ్‌లో మానవీయ కోణం పెరగాలని, మనతో పనిచేసే సిబ్బంది గౌరవాన్ని, అవసరాలను గుర్తించి సహాయం చేస్తే మనకోసం వాళ్లు వంద శాతం పని చేస్తారని చెప్పారు. ఇప్పటికీ తాను సర్పంచుల తో మాట్లాడుతూ నిర్ణయాల్లో మార్పులు చేసుకుంటున్నానని, వింటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. మన్‌కీబాత్‌లో ఆయన (మోదీ) చెప్పేది ఒక సైడే వినాల్సి ఉంటుందని, మనం చెప్పే ది ఉండదన్నారు. పోలీసుశాఖకు బడ్జెట్ కేటాయింపులు పెంచేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రతి డిసెంబరులో ఈ రిట్రీట్ చేయాలని సూచించారు. ‘ప్రస్తుతం సైబర్ క్రైం.. డ్రగ్స్.. డార్క్ వెబ్‌సైట్.. ఇలా నేర స్వరూపమే మారిపోయింది. ఎక్కడెక్కడో కూర్చుని మొబైల్ ద్వారా సైబర్ నేరాలు చేసేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసేస్తున్నారు. ఈ కొత్త సమస్యలను పరిష్కరించేలా పోలీసులు అప్‌గ్రేడ్ కావా లి’ అని చెప్పారు. డిజిటల్ ఎవిడెన్స్‌కు ప్రాధాన్యం పెరిగిందని, సాంకేతిక నైపుణ్యమున్న అధికారులు లేరన్నారు. ‘ఎక్కడ ఏ సమస్య వచ్చినా మొట్టమొదట బద్‌నామ్ అయ్యేది పోలీస్ వ్యవస్థ. ఏ ఆపతి వచ్చినా సాయం కోసం ప్రజలు చూేసది పోలీస్ వైపే. ఆయా సమస్యల పరిష్కారానికి ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్, ఏసీబీ, సీఐడీ వంటి వ్యవస్థలు ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడు ప్రపంచంలో వచ్చిన మార్పులకు ఈ వ్యవస్థలు సరిపోవడం లేదు’ అని చెప్పా రు. నార్కోటిక్స్, సైబర్ క్రైమ్‌కు సంబంధించి మీరు ఇచ్చిన ప్రతిపాదనలు చట్టం రూపంలోకి తేవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని, ఇందుకు డీజీపీ, సీఎస్, న్యాయ, ఆర్థిక, రవాణాశాఖల కార్యదర్శులతో సీఎస్ ఆధ్వర్యం లో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసు స్టేషన్లలో సిబ్బందిని రేషనలైజ్ చేయాలని సూచించారు.
గ్రేహౌండ్స్‌ను ఇంకోచోట వాడుకోవాలి
కూంబింగ్ చేయాల్సిన అవసరం ఇక లేదు కనక గ్రేహౌండ్స్ సిబ్బందిని మరోచోట వాడుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒక డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని, దానికో ఉన్నతాధికారిని పెట్టాలని, ఏ పోలీసు స్టేషన్లో నేరం జరిగినా.. విచారణలో సేకరిస్తున్న సమాచారాన్ని ఇక్కడ నిక్షిప్తం చేయాలని, అప్పుడు భవిష్యత్తు దర్యాప్తులో దాన్ని సాంకేతికత సాయంతో వాడుకోవచ్చని సూచించారు. పోలీసు శాఖలో కృతిమ మేధ వినియోగం పెరగాలన్నారు. ట్రాఫిక్ ప్రధాన సమస్యని, ఫిజికల్ పోలీసింగ్ పెరగాలని నిర్దేశించారు. ప్రజల ప్రవర్తన మారకుండా ఎన్ని చట్టాలు చేసినా మార్పు రాదన్నారు. రాబోయే 25 ఏళ్లకు యాక్షన్‌ప్లాన్ తయారు చేసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ బలోపేతానికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, వాటిని సక్రమంగా వాడాలని సూచించారు.