Share News

‘సీఎం ప్రజావాణి’కి రెండేళ్లు పూర్తి

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:52 AM

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సీఎం ప్రజావాణి’ కార్యక్రమం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది...

‘సీఎం ప్రజావాణి’కి రెండేళ్లు పూర్తి

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సీఎం ప్రజావాణి’ కార్యక్రమం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమం 74 శాతం సక్సెస్‌ రేటుతో ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొన్నది. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ఈ వేదికకు రాష్ట్రం నలుమూలల నుంచి బాధితులు భారీగా తరలివస్తున్నారు. ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 24 సెషన్లు పూర్తి కాగా, మొత్తం 1,12,245 దరఖాస్తులు నమోదయ్యాయి. వీటిలో 47,935 సమస్యలను అధికారులు పరిష్కరించారు. ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ పథకాలు, ఉద్యోగాలకు సంబంధించిన మరో 47,687 దరఖాస్తులను తదుపరి చర్యల కోసం సంబంధిత శాఖలకు సిఫారసు చేశారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డల సమస్యల కోసం ప్రత్యేకంగా ‘ప్రవాసి ప్రజావాణి’ కేంద్రాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే, రాబోయే రోజుల్లో ఈ పరిష్కార శాతాన్ని మరింత పెంచుతామని ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Mar 02 , 2026 | 01:52 AM