ఎన్నికలకు భయపడేది లేదు!: చామల
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:35 AM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు భయపడే ప్రసక్తే లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ విమర్శలపై మండిపడ్డ భువనగిరి ఎంపీ
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు భయపడే ప్రసక్తే లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. 2025 నవంబర్‌లో జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక తమ పాలనకు రెఫరెండం అని కేటీఆర్ ప్రకటిస్తే.. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించారని గుర్తు చేశారు. హైదరాబాద్ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెసే గెలిచిందని, రేపు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వచ్చినా అదే ఫలితం పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం, గాంధీభవన్‌లో చామల మాట్లాడుతూ.. దానం నాగేందర్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, అయితే ప్రతి సందర్భంలోనూ కోర్టులు ఇలానే జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసినప్పుడు కూడా ఇలాంటి తీర్పులు వస్తే సంతోషించేవాళ్లమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పూర్తి స్థాయి వినియోగంలోకి తెచ్చామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో సింగరేణిలోని 18 గనులు మూత పడే పరిస్థితి వస్తే.. కాంగ్రెస్ వచ్చాక బొగ్గు ఉత్పత్తిని పెంచామన్నారు.