Share News

కువైత్‌ వీసాల పేరుతో మోసాలు

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:01 AM

కువైత్‌ ఈ-వీసా, కువైత్‌లో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాల పేరుతో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నిరుద్యోగులను మోసగిస్తున్న సైబర్‌ నేరస్థుల ముఠా ఆటకట్టించేందుకు సీబీఐ ...

కువైత్‌ వీసాల పేరుతో మోసాలు

  • తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఎర

  • సైబర్‌ నేరగాళ్ల నెట్‌వర్క్‌పై కువైత్‌

  • సమాచారంతో రంగంలోకి సీబీఐ

  • ఆ ముఠా కోసం ప్రత్యేక ఆపరేషన్‌

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

కువైత్‌ ఈ-వీసా, కువైత్‌లో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాల పేరుతో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నిరుద్యోగులను మోసగిస్తున్న సైబర్‌ నేరస్థుల ముఠా ఆటకట్టించేందుకు సీబీఐ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ముఠా కువైత్‌ ప్రభుత్వం పేరిట ఒక నకిలీ వెబ్‌సైట్‌ నిర్వహిస్తూ భారతదేశంలో అమాయకులకు వల వేస్తోంది. ఈ విషయంపై కువైత్‌ అధికారులు చేసిన ఫిర్యాదుతో సీఐబీ రంగంలోకి దిగింది. కువైత్‌లో స్థానిక పోలీసులు కూడా వేట మొదలుపెట్టారు. ఈ ముఠా వివిధ రాష్ట్రాల్లో సభ్యులను నియమించుకుని వీసాల పేర దండుకున్న సొమ్మును విదేశాలకు తరలిస్తోందని అధికారులు గుర్తించారు. అమెరికా, బ్రిటన్‌, ఐర్లాండ్‌, సింగపూర్‌ దేశాల్లో కూడా ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలకు పాల్పడుతోందని గుర్తించి.. ఇంటర్‌పోల్‌ సాయంతో ఆయా దేశాల పోలీసుల సమన్వయంతో ‘ఆపరేషన్‌ స్ట్రయిక్‌’ పేరుతో దాడులు నిర్వహించినట్లు సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా పటిష్ఠమైన నెట్‌వర్క్‌ కలిగి డబ్బును పసిగట్టడానికి వీలు లేని విధంగా వెంటవెంటనే అనేక దేశాల గుండా తరలిస్తోందని పేర్కొంది. వీసా వెబ్‌సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కువైత్‌లోని భారతీయ ఎంబసీ ప్రజలను హెచ్చరించింది.

Updated Date - Feb 04 , 2026 | 03:01 AM