Share News

పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:30 AM

అక్రమ మైనింగ్‌, భూ కబ్జాలకు పాల్పడుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు....

పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి

  • మైనింగ్‌, కబ్జాలపై సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని వినతి

  • వట్టినాగులపల్లి భూమిని పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు

  • సతీష్‌ షా ఇంటికి మంత్రి పొంగులేటి ఎందుకెళ్లారు?

  • రూ.1300కోట్ల భూమిని లాక్కునే యత్నం: కేటీఆర్‌

  • ఆరోపణలను ఖండించిన అవినవ్‌ షా, సుధీర్‌ షా, అక్షయ్‌షా

  • తమది కుటుంబ వివాదం.. హద్దుల పంచాయితీ అని వెల్లడి

  • దీనితో మంత్రి పొంగులేటికి సంబంధం లేదని స్పష్టీకరణ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/నార్సింగ్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): అక్రమ మైనింగ్‌, భూ కబ్జాలకు పాల్పడుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ముఖ్య నేతలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వివేకానంద గౌడ్‌, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి చెందిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్‌’ అనే కంపెనీ మైనింగ్‌ నిబంధనలను ఉల్లంఘించి, జంట జలాశయాల పరిధిలో మైనింగ్‌ చేస్తోందని తెలిపారు. ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. ఇదిలా ఉండగా, వట్టినాగులపల్లిలో విలువైన భూమిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం ఆక్రమిస్తోందని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. సోమవారం ఆ స్థల పరిశీలనకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ హై డ్రామా చోటు చేసుకుంది. కేటీఆర్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేస్తారన్న సమాచారంతో హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆయన ఇంటికి చేరుకున్నారు. మరోవైపు సైబరాబాద్‌ పోలీసులు కూడా పెద్దఎత్తున కేటీఆర్‌ ఇంటికి చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చివరకు కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం వట్టినాగులపల్లి చేరుకున్నారు. అక్కడ వివాదంలో ఉన్న భూమిని పరిశీలించారు. భూ యజమానితో నేరుగా మాట్లాడారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. భూ వివాదంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన గచ్చిబౌలి సీఐని ఎందుకు బదిలీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వట్టినాగులపల్లిలోని 27ఎకరాల భూమి... అరవై ఏళ్లుగా సతీష్‌ షా, అతని భార్య, పిల్లల పేరుపై ఉందన్నారు. రోడ్డు కోసం స్థలం కావాలంటూ పొంగులేటి, ఆయన కొడుకు పలుమార్లు సతీష్‌ షా ఇంటికి వెళ్ల్లారని ఆరోపించారు. లేనిపోని వివాదం సృష్టించి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రహరీ సైతం కూల్చివేశారని విమర్శించారు. రూ.1300కోట్ల విలువైన భూమిని తమకే ఇవ్వాలంటూ యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, భూమి ఇవ్వకుంటే సజీవంగా పాతిపెడతామని బెదిరిస్తునానరని ధ్వజమెత్తారు. పొంగులేటికి భూమి అవసరం లేకుంటే రెండుసార్లు సతీష్‌ షా ఇంటికి ఎందుకు వెళ్లారో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఏడీ సర్వేని అడ్డు పెట్టుకుని భూముల హద్దులను మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.


మాది కేవలం కుటుంబ వివాదమే..

తమ కుటుంబానికి సంబంధించిన భూ వివాదాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావడం లేదని అవినవ్‌ షా, సుధీర్‌ కుమార్‌షా, అక్షయ్‌ షా ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌, హరీశ్‌రావులు తమ వాదన కూడా వినాలని, సమయమిస్తే అన్ని డాక్యుమెంట్లతో బీఆర్‌ఎస్‌ భవన్‌కు వస్తామని చెప్పారు. తమ భూ వివాదంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గానీ వారి కుటుంబానికి గానినీ ఎలాంటి సంబంధం లేదని, రాఘవ కన్స్ట్రక్షన్స్‌తో తాము ఎలాంటి డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకోలేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకుల ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వట్టినాగులపల్లి భూవ్యవహారంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో న్యూజెన్‌ డెవలపర్స్‌ ఎండీ సిద్ధార్థ్‌ గాదెతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని సతీష్‌షా తనకు తండ్రి సమానులని, భూమిని డెవల్‌పమెంట్‌కు ఇచ్చే ముందు కూడా ఆయన్ను సంప్రదించానని అవినవ్‌షా తెలిపారు. తాను ఆయనను బెదిరించానన్నది అబద్ధమని అన్నారు. అక్షయ్‌షా మాట్లాడుతూ ఇది పూర్తిగా కుటుంబ వివాదమని స్పష్టం చేశారు. హరీశ్‌రావు, కేటీఆర్‌ పట్ల గౌరవం ఉన్నప్పటికీ, వారు సతీష్‌షా వైపు నిలిచి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. తాము సర్వే చేయించాలని కోరుతున్నామని, ఇందులో రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. సరిహద్దులను తేల్చి ఎవరి భూమి వారికి అప్పగిస్తే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. సుధీర్‌ కుమార్‌షా మాట్లాడుతూ వట్టినాగులపల్లి భూమి తమ కుటుంబానికి చెందినదని, 1969 నుంచి ఈ ఆస్తి కుటుంబం మధ్యనే ఉందని వివరించారు. అన్నదమ్ముల మధ్య భూమి పంపకాల్లో కొంచెం తక్కువ, ఎక్కువ ఉండటం సహజమని, ఏడీ లేదా శాటిలైట్‌ సర్వే ద్వారా సరిహద్దులు తేలితే వివాదం ముగుస్తుందని చెప్పారు. సర్వే నెంబర్లు 259, 245, 262లో సర్వే చేయిస్తే, ఎక్కువ ఉన్న వారు వదులుకుంటారని, తక్కువ ఉన్న వారు తీసుకుంటారని తెలిపారు. కేటీఆర్‌, హరీశ్‌ వంటి నాయకులు ఏకపక్షంగా మాట్లాడడం సరికాదని న్యూజెన్‌ కంపెనీ మేనేజింగ్‌ పార్టనర్‌ సిద్ధార్థ గాదె అన్నారు. తాము కేవలం డెవలపర్స్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. తమ సంస్థలో పొంగులేటి హర్ష ఒక పార్టనర్‌ మాత్రమేనని, షా కుటుంబ వివాదంతో తమకేం సంబంధమని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం వల్ల కంపెనీ ఇమేజ్‌ దెబ్బతినడంతో పాటు తమ ఉద్యోగులు, భాగస్వాములు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

Updated Date - Mar 31 , 2026 | 05:30 AM