మునిసిపల్ పోరులో బీఆర్‌ఎస్ బోల్తా: గుత్తా
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:17 AM
ప్రస్తుత ప్రభుత్వం పనైపోయింది.. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు.. ఇక అధికారం తమదే అన్నట్లుగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడారు..
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ‘ప్రస్తుత ప్రభుత్వం పనైపోయింది.. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు.. ఇక అధికారం తమదే అన్నట్లుగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడారు.. ఇటీవల జరిగిన ముసిసిపల్ ఎన్నికల ఫలితాల్లో బోల్తా పడిన తర్వాత వారు చప్పుడు చేయడం లేదని’ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం శాసనమండలిలోని తన చాంబర్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఏ సర్కారు మీదైనా.. పార్టీ మీదైనా.. ప్రజల్లో వ్యతిరేకత ఉందా..? సానుకూలత ఉందా..? తెలియాలంటే ఎన్నికల ఫలితాలే ఆధారమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు వస్తాయన్నారు. వందశాతం డీలిమిటేషన్ జరుగుతుందని, కొత్త అసెంబ్లీ నియాజకవర్గాలు ఏర్పడతాయన్నారు. వాటి విభజన తీరును ఇప్పుడే అంచనా వేయలేమని చెప్పారు. జమిలి ఎన్నికల్లో మన రాష్ట్రం సైతం ఉండొచ్చన్నారు. తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఎక్కడ అవకాశం వచ్చినా పోటీలో నిలుస్తారని చెప్పారు. తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని, తన పదవీకాలం పూర్తయ్యాక.. మళ్లీ అవకాశం వస్తే శాసనమండలిలోనే ఉంటానని ఆయన తెలిపారు.
8న శాసనమండలి భవనం ప్రారంభం
అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి భవన పునర్నిర్మాణం పూర్తయిందని, 8వ తేదీ ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి భవనాన్ని ప్రారంభిస్తారని మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. హెరిటేజ్ భవనం కావడంతో రూ.30కోట్ల వ్యయంతో పలు జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేపట్టామన్నారు. అక్కడే సీఎం, చైర్మన్, వైస్ చైర్మన్ల చాంబర్లు, సెక్రటరీ ఆఫీస్, కౌన్సిల్ సెక్రెటేరియేట్, మీడియాకు హాల్‌ను సిద్ధం చేసినటు, సెంట్రల్ హల్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ తరహాలో శాసనసభ ఉండబోతుందన్నారు. సీఎం ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల రాష్ట్ర శాసనపరిషత్ దేశానికే ఆదర్శం కానుందన్నారు. ఆదర్శనగర్‌లోని 9 ఎకరాల్లో సర్కారు కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మించనుందన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఈ నెల 8న లేదా 16న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను చేపట్టనున్నట్లు సుఖేందర్‌రెడ్డి తెలిపారు.