Share News

పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:40 AM

రాష్ట్ర రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్కు ....

పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి

  • ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల నిరాహార దీక్షలో బీజేపీ నేతల డిమాండ్‌

  • హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీలు ఈటెల, డీకే అరుణ, రఘునందన్‌ రావు

కవాడిగూడ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ దీక్షకు సంఘీభావంగా ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు, శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్‌, డీకే అరుణ, రఘునందన్‌రావు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 3.6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 2,8 లక్షల రిటైర్డ్‌ ఉద్యోగుల జీవితాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. మొత్తం 6.4 లక్షల మందికి సంబంధించిన బకాయిలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటం దారుణమన్నారు. గ్రాట్యూటీ, కమ్యూటేషన్‌, పీఎఫ్‌ బకాయిలతో పాటు ఆరు డీఏలను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదని పేర్కొన్నారు. కోర్టుల ఒత్తిడి భయంతో ఇటీవల ఒక డీఏ ప్రకటించి చేతులు దులుపుకున్నారని, ఉద్యోగులసమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. సిగ్గులేకుండా తన పదవిని కాపాడుకోవడం కోసమే గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని అంటున్నారని, రాబోయే ఎన్నికల కోసం డబ్బులు జమచేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా మారిందని ఆయన విమర్శించారు. అనంతరం ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు.


ఇప్పుడు రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నియంతృత్వ పాలన పోయి మరో నియంతృత్వ పాలన వచ్చిందని, ప్రభుత్వం మోసం చేస్తున్న తీరును ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందక వైద్యఖర్చులకు కూడా డబ్బులు లేక సుమారు 70మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. జెండాలతో సంబంధం లేకుండా తెలంగాణ పోరాటానికి మద్దతు ఇచ్చిన ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేస్తూ వస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత సిగ్గుమాలిన వ్యవస్థ ఉంటుందని అని భావించలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై రేవంత్‌రెడ్డికి అవగాహన ఉందా లేదా ఆయన ప్రశ్నించారు. ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ఎన్నికల ముందు ఇచ్చిన మాటలను ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన సెక్యూరిటీ లేకుండా అశోక్‌నగర్‌ స్టడీ సర్కిల్‌ దగ్గరకు వస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల కష్టాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురమయ్య, మాజీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ మంత్రి కృష్ణయాదవ్‌, సీఈ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు, ఎంబీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డితో పాటు రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 03:40 AM