నేడు మహబూబ్‌నగర్‌కు నితిన్ నబీన్ రాక
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:21 AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బుధవారం మహబూబ్‌నగర్‌కు రానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు...
బీజేపీ ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో సమ్మేళనం
పార్టీ పగ్గాలు చేపట్టాక తొలిసారి తెలంగాణకు
మునిసిపల్ ఎన్నికల వేళ పర్యటనకు ప్రాధాన్యం
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం: రాంచందర్‌రావు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బుధవారం మహబూబ్‌నగర్‌కు రానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులతో జరిగే సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అదే విధంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. మునిసిపల్ ఎన్నికల వేళ, బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నబీన్ తెలంగాణలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించకుంది. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. నబీన్ పర్యటన బీజేపీ అభ్యర్థుల గెలుపునకు మరింత దోహదపడుతుందని స్పష్టం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాఽధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న ఆయనకు రాష్ట్ర బీజేపీ ఘన స్వాగతం పలుకుతుందని పేర్కొన్నారు. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మునిసిపల్, పార్టీ నాయకులు, కార్యకర్తల వరకు అందరినీ ఉత్తేజపరిచేలా ఈ సభ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కార్యకర్తలు దీనిని వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు రాంచందర్‌రావు వెల్లడించారు. కాగా, బీజేపీ నాయకులు సభ నిర్వహించే ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో నాలుగు రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ను బీజేపీ జెండాలతో కాషాయమయం చేశారు.